Show Cause Notice: టీ.కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలికి షోకాజ్ నోటీస్
ABN , Publish Date - May 21 , 2025 | 02:59 PM
Show Cause Notice: తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
హైదరాబాద్, మే 21: తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతా రావుకు (Telangana Congress Women President Sunita Rao) పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై (TPCC Chief Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్‌లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుబట్టింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సునీతా రావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసు జారీ చేశారు. సునీతా రావుకు ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీలో చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం తప్పని.. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని నోటీసులో అధిష్టానం స్పష్టం చేసింది.
కాగా.. కొద్ది రోజుల క్రితం గాంధీభవన్‌లో సునీతా రావు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ ఛాంబర్ ఎదుట సునీతారావు ధర్నాకు దిగారు. పది మంది మహిళా నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మహిళా నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని.. పోస్టుల విషయంలో మహిళా నాయకులను పార్టీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. మహేష్ గౌడ్ బంధువులకే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కార్పొరేషన్లు, పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సునీతారావు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో అధికార పార్టీలో ఉంటూ పార్టీ ఆఫీసులో నిరసన చేపట్టడాన్ని అధిష్టానం తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే టీపీసీసీ చీఫ్‌పై ఆరోపణలు చేయడాన్ని మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సునీతారావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు
KTR Reacts: కేసీఆర్‌కు నోటీసుల వెనక ఉంది వారే.. కేటీఆర్ ఫైర్
Read latest Telangana News And Telugu News