Share News

Congress party Foundation Day Celebrations: రాష్ట్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ABN , Publish Date - Dec 28 , 2025 | 01:55 PM

141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశ్యవాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతోంది.

Congress party Foundation Day Celebrations: రాష్ట్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఖమ్మం, డిసెంబర్ 28: 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశ్యవాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతోంది. ఆదివారం మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు.

బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోతున్న తరుణంలో దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పుట్టిందని వివరించారు. నిజాం పోరాట కాలంలో మధిరలో కీర్తిశేషులు జమలాపురం కేశవరావు పార్టీ జెండా ఎగరవేసిన చరిత్ర ఉందన్నారు. మధిర మున్సిపాలిటిలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఆవరణలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.


గాంధీ భవన్‌లో..

గాంధీ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. జెండా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ భవన్‌లో గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్లానింగ్ కమిషన్ వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ సేవా దళ్ 102 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్లోగన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ నెహ్రూ విగ్రహం వరకు సేవా దళ్ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు.


జాతీయోద్యమంలో స్వాతంత్ర్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించి.. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ముందుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్‌తో కలిసి పొన్నం ప్రభాకర్ మీడియాలో మాట్లాడుతూ.. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, యూపీఏ ప్రభుత్వాలు చేసిన సంస్కరణల వల్లే భారత్ ముందుందన్నారు. 2004లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది మేధావులతో సంప్రదించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పెంచడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు.


ప్రజలు తిండి లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదనే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీని ద్వారా పని లేని రోజుల నుండి పని కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపు మారిందని చెప్పారు. 2014 ఎన్నికల ఎజెండాలో బీజేపీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పామని చెప్పారు. దానిని విస్తరించకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వంపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.


ఈ చట్టంలో రాష్ట్రాలపై భారం మోపేలా 60:40 శాతం నిధులు కేటాయించేలా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జీరాంజీ పేరు పెట్టారన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని చేస్తుందంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందుకు నిరసనగా ప్రతి గ్రామంలో గాంధీ ఫోటోలతో ప్రతి ఒక్కరు నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 28 , 2025 | 02:10 PM