CM Revanth Reddy: పాలమూరు జిల్లా బిడ్డ.. జాతీయ నేతగా ఎదగడం గర్వకారణం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:58 AM
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు పూడ్చ లేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 24: ఎక్కడ రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం సుధాకర్ రెడ్డి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం హిమయత్ నగర్‌లోని సీపీఐ కార్యాలయం ముఖ్దుం భవన్‌లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలు, బహుజనుల కోసం పోరాడిన నేత సురవరం సుధాకర్ రెడ్డి అని పేర్కొన్నారు.
విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా ఆయన ఎప్పుడూ తన సిద్ధాంతాలను వీడలేదని చెప్పారు. పలువురు మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలతోపాటు వామపక్ష నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
సురవరంకు ఘనంగా కేటీఆర్ నివాళి..
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు పూడ్చ లేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి.. ఆయనకు ఘనంగా కేటీఆర్ నివాళులుర్పించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో విప్లవ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలతోపాటు తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర వహించడం ద్వారా తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు.
పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి ఉద్యమాల నుంచి రాష్ట్ర స్థాయికి.. అక్కడి నుంచి జాతీయ స్థాయి వరకు ఆయన ఎదిగారని గుర్తు చేశారు. ఆయన మరణం.. తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ప్రజా సమస్యల పట్ల ఆయన క్రియాశీలకంగా పని చేశారంటూ ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో జాతీయ స్థాయిలో సురవరం గారితో తనకు కలిసి పనిచేసే అవకాశం కలిగిందని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్‌తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.