Share News

CM Revanth Reddy: నిన్నటి వరకు ఒక లెక్క.. గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క: సీఎం రేవంత్

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:35 PM

2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దాంతో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

CM Revanth Reddy: నిన్నటి వరకు ఒక లెక్క.. గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క: సీఎం రేవంత్

హైదరాబాద్, డిసెంబర్ 07: రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి అంటే.. డిసెంబర్ 07వ తేదీకి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతోంది. ఇదే సమయంలో.. ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ డిసెంబర్ 8వ తేదీన ప్రారంభకానుంది. అలాంటి వేళ సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం స్పందించారు. జాతి కోసం.. జనహితం కోసం.. గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలన్నారు. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఆ ధైర్యం ఇచ్చి.. తమ ఓటుతో గెలుపు సంకల్పం ఇచ్చి.. నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.


అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామన్నారు. రుణమాఫీతో రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచామని స్పష్టం చేశారు. బలహీనవర్గాల ఆకాంక్షలను కులగణనతో కొత్త మలుపు తిప్పామని ధీమా వ్యక్తం చేశారు. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమాన్ని సార్థకత చేశామని గుర్తు చేశారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణం సహా.. స్కిల్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామని వివరించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నిన్నటి వరకు ఒక లెక్క.. గ్లోబల్‌ సమ్మిట్‌ తర్వాత మరోలెక్క అని సీఎం రేవంత్‌ వెల్లడించారు.


సోమవారం నుంచి రెండు రోజులపాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి. గ్లోబల్‌ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు హైదరాబాద్‌కు తరలిరానున్నారు. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్‌ నెంబర్‌ 14 నుంచి గ్లోబల్‌ సమ్మిట్‌ వేదిక వరకు భారీగా పోలీసులు మోహరించారు.


2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దాంతో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నేటితో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కానుంది.



ఈ వార్తలు కూడా చదవండి..

రైజింగ్ తెలంగాణ కాదు.. అవినీతి తెలంగాణ: ఎంపీ లక్ష్మణ్

హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Dec 07 , 2025 | 07:08 PM