Share News

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు: కేటీఆర్ ఆగ్రహం..

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:07 PM

మహబాబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నాచారం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అందించడం లేదంటూ పలు వార్తపత్రికలు ప్రచురించాయి. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికలకు వివాదం తలెత్తడంతో పిల్లలకు అన్నం పెద్దలేదన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు: కేటీఆర్ ఆగ్రహం..
BRS working president KTR

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal Scheme) సరిగా అందడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) మండిపడ్డారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని, పిల్లలను పస్తులు ఉంచుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారంటే, ఇక మంత్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ చిన్నపిల్లలకు భోజనం అందించడంలో సీఎంకు లేదంటూ విమర్శించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు.


అసలు విషయం ఇదే..

కాగా, మహబాబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నాచారం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అందించడం లేదంటూ పలు వార్తపత్రికలు ప్రచురించాయి. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికలకు వివాదం తలెత్తడంతో పిల్లలకు అన్నం పెద్దలేదన్న వార్తలు వెలువడ్డాయి. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు కార్మికులు అరకొరగా భోజనం అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆహారం నాణ్యతా లోపించడంతో వారి పస్తులు ఉంటూ తిరిగి ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్నారు. మరోవైపు నిన్న(శుక్రవారం) పాఠశాల ప్రిన్సిపల్, మధ్యాహ్న భోజన కార్మికులకు మధ్య వివాదం నెలకొంది. దీంతో విద్యార్థులకు నిన్న భోజనం అందించలేదు. దీనిపై చిన్నారులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పగా ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఈవో నేరుగా పాఠశాల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్, వంట ఏజెన్సీ కార్మికలపై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్తా పత్రికల క్లిపింగులను కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు.


కేటీఆర్ ట్వీట్..

"పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ.. బడిపిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా?. అమృత్ స్కీమ్‌ను అప్పనంగా బామ్మర్దికి కట్టబెట్టడంలో ఉన్న తెలివి, బుక్కెడు బువ్వకు అలమటిస్తున్న పసిపిల్లల కడుపు నింపడంలో లేదా?. పారిశ్రామికవేత్త అదానీకి తెలంగాణ వనరులు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై లేదా?. మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంలో ఉన్న ప్రేమ.. భవిష్యత్ భారతావని వారసులైన పసిపిల్లల ఆకలి కేకలపై లేదా?. మంత్రుల సంగతి దేవుడెరుగు, ముఖ్యమంత్రి ఇలాకాలోనే పిల్లల పస్తులు ఉంటున్నారు. మీ ఢిల్లీ బాసులు.. మీ గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదు రేవంత్.. ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టు. ఒక్కపూట ఫొటోలకు ఫోజులిచ్చి గప్పాలు కొట్టడం కాదు. నిత్యం గుప్పెడు అన్నం అందుతుందో లేదో సమీక్ష చేసి చూడు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన" అంటూ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అన్నా క్యాంటీన్‌లో అమ్మ రాజశేఖర్ సందడి..

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

Updated Date - Feb 07 , 2025 | 03:09 PM