KTR: కృష్ణా జలాలు.. ఆంధ్రప్రదేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
ABN , Publish Date - Feb 16 , 2025 | 09:03 PM
నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కృష్ణా జలాలను ఏపీ తరలిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే 646 టీఎంసీలను ఏపీ వినియోగించిందని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తన్నుకుపోతున్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణా బోర్డు నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహించారు. ఏపీ ఇష్టారాజ్యంగా, యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలిస్తున్నా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్‌లో చలనం లేదని మండిపడ్డారు. కృష్ణా బోర్డు (Krishna Board) సైతం చోద్యం చూస్తోంది తప్ప చర్యలకు దిగడం లేదని కేటీఆర్ విమర్శించారు.
నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కృష్ణా జలాలను ఏపీ తరలిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే 646 టీఎంసీలను ఏపీ వినియోగించిందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ నిలువరించడం లేదని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదుల్లోని బొట్టుబొట్టునూ కాపాడి బీడు భూములను సైతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సస్యశ్యామలం చేశారని కేటీఆర్ కొనియాడారు. కానీ ఇప్పుడు ఏడాది కాలంలోనే పంటపొలాలను కాంగ్రెస్ ఎండబెట్టిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అలాంటిది వాటిని ఒక్కొక్కొటిగా రేవంత్ రెడ్డి సర్కార్ గంగలో కలుపుతోందని కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు.
రాబోయేది వేసవి కాలమని.. తాగు, సాగునీళ్లకు కష్టకాలమని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసినా రేవంత్ రెడ్డి మాత్రం గాలిమోటర్‌లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులకు అన్నదాతల గోస ఏం తెలుస్తుందని ధ్వజమెత్తారు. కేఆర్ఎంబీ పరిధిలోని త్రీమెన్ కమిటీ దిక్కులేదని.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జాగో రైతున్న జాగో.. జాగో తెలంగాణ జాగో.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: బాబోయ్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన