TG Politics: కులగణనపై ఎంపీ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాల్సిందే అంటూ డిమాండ్..
ABN , Publish Date - Feb 05 , 2025 | 07:57 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల తర్వాత వారి జనాభా ఎలా తగ్గిందంటూ ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి వారిని దారుణంగా వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తప్పులతడకగా లెక్కలు వేసి సర్వే పూర్తయిందని చెప్పడం ముమ్మాటికీ వెనకబడిన వర్గాలను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వే పూర్తి చేసిందని లోక్ సభలో మీరు (రాహుల్ గాంధీ) చెప్పడం పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్ మండిపడ్డారు. లక్షలాది మంది వివరాలు సేకరించకుండా సర్వే ఎలా పూర్తవుతుందని రాహుల్‌ని కేటీఆర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సర్వే ఇలా..
పదేళ్ల కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో ఇది 51 శాతంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. మైనారిటీల్లో ఉన్న బీసీలనూ కలిపితే ఆనాడు బీసీల సంఖ్య ఏకంగా 61 శాతానికి చేరిందని స్పష్టం చేశారు. అలాంటిది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వేలో బీసీల జనాభా 1.64 లక్షలకు ఎలా తగ్గిందని, 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దశాబ్ద కాలంలో బలహీన వర్గాల జనాభా తగ్గినట్టు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయిందని సాక్షాత్తూ దేశ అత్యున్నత చట్టసభలో పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు.
చూస్తూ ఊరుకోరు..
అసెంబ్లీ సమావేశాల సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరికి కాంగ్రెస్ పార్టీపరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలోని బీసీ సమాజం సిద్ధంగా లేదని రాహుల్‌ని లేఖలో హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని మీరిచ్చిన మాటను ఏడాది కాలంలోనే మంటగలిపి బీసీల గొంతు కోశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేసి డిక్లరేషన్లకు ఘోరీ కట్టిన పాపం కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయమని అన్నారు.
చేతులు దులుపుకుంటారా?
తెలంగాణలో అమలు చేయని హామీలను, ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కులగణన సర్వేను అంశాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్‌లో దీని ప్రస్థావన తెచ్చారని ఆయన మండిపడ్డారు. కులగణన తప్పులను సవరించాల్సిన బాధ్యత మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ బీసీ సంఘాల నేతలు ఏకంగా కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పులతడకేనని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని అన్నారు. ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన అన్యాయం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఎలా తగ్గింది?
పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి, బీసీల జనాభా తగ్గడం ఎలా సాధ్యమో చెప్పగలరా? రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వెనకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పులకుప్పగా తయారు చేయడం, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని అన్నారు. తప్పుడు లెక్కల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణమన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పార్లమెంట్‌లో రాహుల్ కోరడం మరో విడ్డూరమని అన్నారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే కాంగ్రెస్ నిజస్వరూపం ఏడాది కాలంగా అనేక రూపాల్లో బయటపడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించవని కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్యారెంటీల పేరిట చేసిన గారడీని, డిక్లరేషన్ పేరిట చేసిన ఈ దగాను చూసిన తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఏ ఎన్నికల్లోనూ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ వేదికగా బీసీ డిక్లరేషన్ ఓ నాటకమని, బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్ల హామీ బూటకమని తేలిపోయిందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..