BRS MLC Candidate: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు.. ఎవరిని ప్రకటించారంటే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:47 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి మరీ పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించింది. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. సీపీఐ తరఫున చాడ వెంకటరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సామాజికపరంగా చూస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు కాంగ్రెస్ టికెట్ కేటాయించినట్లు అయ్యింది. కాగా, పార్టీలో క్రియాశీలకంగా లేని విజయశాంతికి టికెట్ దక్కడం చర్చనీయాంశం అయ్యింది. వీరంతా సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పదవుల కోసం తెలంగాణ ఉద్యమకారులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ ఎన్ని పార్టీలు మారినా మాత్రం అవకాశం దక్కలేదు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు, సత్యనారాయణ పేర్లను ఫైనల్ చేసింది. ఈ మేరకు వారి పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‍కు పంపించారు. అయితే గవర్నర్ తిరస్కరించడంతో హైకోర్టును దాసోజు శ్రవణ్ ఆశ్రయించారు. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెుత్తం ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు మార్చి 10 చివరి తేదీ. అలాగే మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Telangana MLC: రాములమ్మకు భలే ఛాన్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లే..
Vijayashanthi: లాస్ట్ మినిట్.. జాక్ పాట్