Share News

Family Suicide: మియాపూర్‌లో దారుణం..

ABN , Publish Date - Aug 21 , 2025 | 09:39 AM

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మరణించారు.

Family Suicide: మియాపూర్‌లో దారుణం..

హైదరాబాద్, ఆగస్టు 21: మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


అందులో భాగంగా ఆ ఇంటి పరిసరాల్లోని వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే పసి కందును చంపేసి అనంతరం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పసి కందును హత్య చేసి.. అనంతరం వారంతా విషయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


అయితే పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత ఈ కేసులో ఒక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని వారంతా ఆత్మహత్య చేసుకోవడంతో.. స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక మృతుల వివరాలు.. లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అల్లుడు అనిల్ (40), కవిత (38)తోపాటు అనిల్, కవితల కుమార్తె అప్పు (2).


మరో వైపు మియాపూర్ సమీపంలోని చందానగర్‌లో స్థానిక నాలాలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సదరు మహిళ మృతదేహంపై నర్సమ్మ అనే పచ్చబొట్టు ఉంది. అలాగే ఆమె వద్ద ఒక పర్సు ఉందని.. అందులో కమ్మలు, బ్రాస్లెట్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని వారు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 09:53 AM