Share News

AIG Hospital: ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:55 PM

AIG Hospital: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.

AIG Hospital: ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
AIG Hospital

హైదరాబాద్, జూన్ 7: నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ (AIG Hospital) గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈరోజు (శనివారం) స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి బయటకు పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రోగులు, రోగుల బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.


ఏఐజీ ఆస్పత్రికి నిత్యం రోగులు వస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అగ్నిప్రమాదంతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని 30 నిమిషాల పాటు శ్రమించి పూర్తిగా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే మంటలు ఎలా వచ్చాయనే దానిపై ఆస్పత్రి సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా విచారణకు ఆదేశించారు. ఇదే ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన రాజకీయ నేతలు ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) కూడా ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్‌కు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వచ్చి వెళ్లిన కాసేపటికే అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. మాగంటిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆస్పత్రికి వస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.


అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అపస్మారస్థితిలో ఉన్న ఎమ్మెల్యేకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు సీపీఆర్ చేశారు. ఆ తరువాత వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేస్తున్నారు. నిన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కూడా ఆస్పత్రికి వచ్చి ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 04:28 PM