GHMC Expansion: 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:37 AM
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ...
ఇదీ మహా హైదరాబాద్ స్వరూపం
జీహెచ్‌ఎంసీ పునర్విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు పెరిగింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహా విస్తరణ చేపట్టింది.
ఇందులో భాగంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు 2053చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. జీహెచ్‌ఎంసీ అవతల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసుకొని 300 డివిజన్లతో మహా హైదరాబాద్‌ను నిర్ణయించింది. దీంతో జీహెచ్‌ఎంసీలో జోన్ల సంఖ్యను ఆరు నుంచి 12కి పెంచారు. 30 సర్కిళ్లను 60 సర్కిళ్లు చేశారు. కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాలను కూడా ఖరారు చేశారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా ఖరారు చేశారు.
ఈ పునర్విభజనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ తుది నోటిఫికేషన్ మేరకు 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం, 12 జోన్లు, 60 సర్కిళ్లుగా పునర్విభజనను ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో 292ను జారీ చేసింది. కాగా, వార్డుల సరిహద్దుల వివరాలను సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల నోటీసు బోర్డుల పైనా, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ ఉంచినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
EV charging stations: సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
New Year: న్యూ ఇయర్ రోజున 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్