Share News

Hyderabad: మద్యం మత్తులో రోడ్డెక్కేస్తున్న కుర్రకారు!

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:42 AM

మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరం అనే మాటను హైదరాబాద్‌ యువత పెడచెవిన పెడుతోందా? మద్యం మత్తులో రోడ్డెక్కి ప్రమా దం అంచున దూసుకెళుతోందా

Hyderabad: మద్యం మత్తులో రోడ్డెక్కేస్తున్న కుర్రకారు!

  • డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో అధికంగా దొరుకుతుంది యువతే

  • సైబరాబాద్‌ పరిధిలో వారంలో 272 కేసులు.. ఇందులో 18-30 ఏళ్ల వారు 126 మంది

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరం అనే మాటను హైదరాబాద్‌ యువత పెడచెవిన పెడుతోందా? మద్యం మత్తులో రోడ్డెక్కి ప్రమా దం అంచున దూసుకెళుతోందా? అంటే డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల వివరాల జాబితా అవుననే అంటోంది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడిన వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 272 మందిపై భారతీయ న్యాయ సంహిత-2023 సెక్షన్‌ 105 ప్రకారం డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశామని పోలీసులు ఆదివారం ప్రకటించారు. మాదాపూర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గచ్చిబౌలి, షాద్‌నగర్‌, చేవెళ్ల, నార్సింగి, రాయదుర్గం, మియాపూర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, జీడిమెట్ల, అల్వాల్‌, కేపీహెచ్‌బీ, మేడ్చల్‌, ఆర్‌సీ పురం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి.


అయితే, ఈ 272 మందిలో 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు వారు 126 మంది ఉండడం గమనార్హం. పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 18-20ఏళ్ల లోపు వారు 8 మందిపై, 21-30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 118 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే, 31-40 ఏళ్ల లోపు వారు 90 మంది, 41-50 ఏళ్లలోపు వ యస్సు వారు 42 మంది, 51-60 ఏళ్లలోపు ఉన్న 10 మంది, 61 ఏళ్ల పైబడిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఇక, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో ద్విచక్రవాహనదారులే అధికంగా ఉండడం గమనార్హం. మొత్తం 272 కేసుల్లో 227 మంది ద్విచక్రవాహనదారులు ఉన్నారు. త్రిచక్రవాహనదారులు 15, ఫోర్‌ వీలర్‌ వాహనదారులు 29 మంది ఉన్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నా.. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు కోరుతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన వారికి జరిమానాతోపాటు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు వయస్సు కేసులు

18-20 8

21-30 118

31-40 90

41-50 42

51-60 10

61 ఏళ్ల పైవారు 4


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 04:42 AM