Share News

Hyderabad: త్వరలో పాడ్‌ కార్లు

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:31 AM

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జామ్‌.. నత్తను తలపించే వేగం..! ఈ పరిస్థితికి మెట్రోరైల్‌ కొంత వరకు చెక్‌ పెట్టినా.. ఐటీ కారిడార్‌లో మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకోవడం గగనంగా మారే పరిస్థితి..!

Hyderabad: త్వరలో పాడ్‌ కార్లు

బ్యాటరీ లేదా విద్యుత్తుతో పాడ్‌కార్‌ పనిచేస్తుంది. ఒక పాడ్‌కార్‌లో 6-8 మంది ప్రయాణించవచ్చు.

డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు టచ్‌ప్యాడ్ల మీద తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. వేగం గంటకు 40 కి.మీ.

ప్రస్తుతం ముంబైలోని బాంద్రా-కుర్ల కాంప్లెక్స్‌ మధ్య పాడ్‌కార్‌ కారిడార్‌ వ్యవస్థ నిర్మితమవుతోంది.

  • 2 ఎలివేటెడ్‌ కారిడార్లలో 14.8 కి.మీ.లలో ఏర్పాటు

  • 1,480 కోట్ల రూపాయల అంచనా వ్యయం

  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్‌

  • రోజూ లక్ష మంది ప్రయాణం

  • హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక.. డీపీఆర్‌ సిద్ధం

  • త్వరలో సర్కార్‌కు అందజేత

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జామ్‌.. నత్తను తలపించే వేగం..! ఈ పరిస్థితికి మెట్రోరైల్‌ కొంత వరకు చెక్‌ పెట్టినా.. ఐటీ కారిడార్‌లో మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకోవడం గగనంగా మారే పరిస్థితి..! మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా కార్యాలయాలకు.. బహుళ జాతి సంస్థల్లో విధులకు.. బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక మార్గాల్లో నేరుగా వెళ్లగలిగితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి వ్యవస్థనే నగరంలో అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) సంకల్పించింది. పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌(పీఆర్‌టీ) లేదా పాడ్‌ట్యాక్సీ పేరుతో కొత్త రవాణా వ్యవస్థను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్‌ కార్‌ లేదా పాడ్‌ ట్యాక్సీలను పరిచయం చేసి.. ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించి, అనుమతులు, నిధులు కోరనున్నట్లు తెలుస్తోంది.


రెండో దశ మెట్రోరైల్‌ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా(2029 లక్ష్యం) పాడ్‌ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది. హైటెక్‌సిటీ, కొండాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లోని మెట్రోస్టేషన్లు, కార్యాలయాలు, బహుళ అంతస్తులకు పాడ్‌ కార్ల సేవలను రెండు కారిడార్లలో అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భావిస్తోంది. మెట్రో స్టేషన్‌కు అనుసంధానంగా ప్రారంభమయ్యేలా మొదటి ఎలివేటెడ్‌ కారిడార్‌(8.8 కిలోమీటర్లు)ను రూ.880 కోట్ల అంచనాతో నిర్మిస్తారు. ఈ కారిడార్‌ రాయదుర్గం మెట్రో-ఐటీసీ కోహినూర్‌-నాలెడ్జ్‌సిటీ మధ్య ఉంటుంది. ఈ కారిడార్‌లో 28 స్టాప్‌లు ఉంటాయి. రూ.600 కోట్ల అంచనాతో రెండో కారిడార్‌(6 కిలోమీటర్లు)ను నిర్మిస్తారు. ఈ కారిడార్‌ 27 స్టాప్‌లతో రాయదుర్గం మెట్రో-టెక్‌మహీంద్రా-హైటెక్‌సిటీ/కొండాపూర్‌ మధ్యలో కొనసాగుతుంది. నిజానికి గత సర్కారు హయాంలోనే పాడ్‌ కార్లను ప్రతిపాదించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి మైడ్‌స్పే్‌స-ఐటీసీ కోహినూర్‌(7.5 కిలోమీటర్లు), అసెంబ్లీ మెట్రో నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్‌ స్టేషన్‌ వరకు(10 కిలోమీటర్లు) రెండు కారిడార్లను ప్రతిపాదించారు. 2022 వార్షిక నివేదికలోనే అప్పటి సర్కారు అలా్ట్ర పీఆర్టీ లిమిటెడ్‌తో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. అయితే.. అప్పట్లో ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమైంది. తాజాగా ప్రభుత్వం ఐటీకారిడార్‌లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.


ఎలా పనిచేస్తుంది?

పాడ్‌కార్‌ బ్యాటరీ లేదా విద్యుత్తుతో పనిచేస్తుంది. పర్యావరణ హితంగా ఉంటుంది. ఇందులో 6-8 మంది ప్రయాణించవచ్చు. కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. వీటిల్లో డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు ఇందులో కూర్చోగానే.. తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి టచ్‌ప్యాడ్లు ఉంటాయి. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ డీపీఆర్‌ ప్రకారం.. ట్రాఫిక్‌ రద్దీ వేళల్లో ఈ పాడ్‌కార్ల ద్వారా గంటకు 10 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారని, రోజువారీగా ఈ సంఖ్య లక్షగా ఉంటుందని అంచనా. ఈ రకమైన వ్యవస్థతో హైదరాబాద్‌లో పట్టణ రవాణా మరింత అభివృద్ధి చెందుతుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా-కుర్ల కాంప్లెక్స్‌ మధ్య పాడ్‌కార్‌ కారిడార్‌ వ్యవస్థ నిర్మితమవుతోంది. గ్రేటర్‌ నోయిడా నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రూ.810 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ సిద్ధమైంది.

రూట్లు: రాయదుర్గం-కొండాపూర్‌,

రాయదుర్గం-నాలెడ్జ్‌ సిటీ

మొత్తం స్టాప్‌లు: 55

మొత్తం దూరం: 14.8 కిలోమీటర్లు

గరిష్ఠ వేగం: గంటకు 40 కిలోమీటర్లు

మూడేళ్లలో..అందుబాటులోకి వచ్చే అవకాశం

Updated Date - Jan 20 , 2025 | 03:31 AM