Share News

PM Ekta Mall: 50 అంతస్తుల్లో ‘ఏక్తా మాల్‌’!

ABN , Publish Date - Aug 15 , 2025 | 03:42 AM

దేశీయ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్న లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాల్లో ‘ఏక్తా మాల్‌’ పేరుతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.

PM Ekta Mall: 50 అంతస్తుల్లో ‘ఏక్తా మాల్‌’!

  • రాయదుర్గంలో 1500 కోట్లతో నిర్మాణం

  • 6 అంతస్తులతో నిర్మాణానికి పనులు

  • దాన్ని 50 అంతస్తులకు పెంచాలని సీఎం నిర్ణయం

  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): దేశీయ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్న లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాల్లో ‘ఏక్తా మాల్‌’ పేరుతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో పీఎం ఏక్తామాల్‌ భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణాలకు కేంద్రం ఇప్పటికే రూ.5 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో భవనాన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ)’ పక్కన ఈ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర తోలు పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ (టీఎ్‌సఎల్‌ఐపీసీ)కి చెందిన 5.16 ఎకరాలను ఈ భవనం కోసం కేటాయించారు. ఇక్కడ ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణానికి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అయితే దీన్ని 50 అంతస్తుల్లో నిర్మించాలని ఇటీవలనిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.


ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఏజెన్సీగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (టీజీటీపీసీ) వ్యవహరించనుంది. సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారులు కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 50 అంతస్తుల్లో భవన నిర్మాణానికి దాదాపు రూ.1500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నిధుల సమస్య లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 అంతస్తుల్లో నిర్మాణం పూర్తయ్యాక.. ఆరు అంతస్తుల్లో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ కేంద్రాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ఎగుమతులకు అర్హత ఉన్న 33 రకాల ఉత్పత్తులను ఇప్పటికే గుర్తించారు. వీటికి కొత్త భవనంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. అలాగే తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ఉత్పత్తులనూ ఇక్కడ విక్రయించనున్నారు. మిగతా 44 అంతస్తులను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించాలని భావిస్తున్నారు. ఈ 50 అంతస్తుల భవనం పూర్తయితే నగరంలో అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య భవనం అవుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 03:42 AM