Hyderabad: తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా?
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:36 AM
హైదరాబాద్ నగరంలో మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క తాటిచెట్టు కనిపించదు! కానీ, హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 148 కల్లు కాంపౌండ్లు ఉన్నాయి
హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి.. 148 కల్లు కాంపౌండ్లకు అనుమతి.. రంగారెడ్డి జిల్లాలో మరీ దారుణం
చెట్ల కంటే.. కేటాయింపులే ఎక్కువ
ఆగస్టు నుంచి నవంబరు వరకు సీజన్ లేకున్నా కల్లు విక్రయాలు ఎలా?
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క తాటిచెట్టు కనిపించదు! కానీ, హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 148 కల్లు కాంపౌండ్లు ఉన్నాయి! చెట్లు లేనిచోట కల్లు కాంపౌండ్లు ఎలా సాధ్యం?? అంటే.. రోజూ విక్రయిస్తున్న లక్షల లీటర్ల కల్లు కల్తీయేనా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది..! ఉమ్మడి(రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి) జిల్లాలో 1.89 లక్షల తాటి, ఈత చెట్లు ఉంటే.. కేటాయింపులు 1.94 లక్షల చెట్ల మేర ఉన్నట్లు అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 478 కల్లు డిపోలకు అనుమతులిచ్చారు. సర్కారు ఖజానాను నింపడంలో కీలకంగా వ్యవహరించే అబ్కారీ శాఖ.. రాబడే ధ్యేయంగా అడ్డంగా కల్లు దుకాణాలకు అనుమతులిస్తుండడం కల్తీ కల్లు తయారీకి కారణమవుతోంది. ఫలితంగా కల్తీ కల్లు బాధితులు పెరగడమే కాక.. మరణాలూ చోటు చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో 77.78 లక్షల చెట్లు
రాష్ట్రంలో 77.78 లక్షల ఈత, తాటి చెట్లు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక చెట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ 15,36,361 తాటి చెట్లు, 4,08,552 ఈత చెట్లు ఉన్నాయి! 13,13,266 తాటి చెట్లతో ఉమ్మడి మెదక్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 7,33,253 ఈత చెట్లున్నాయి. ఇక్కడ తాటిచెట్ల సంఖ్య 2,49,680. రాష్ట్రంలో 4,064 తాడి సహకార సంఘాలు(టీసీఎస్) ఉన్నాయి. వాటి పరిధిలో 4,697 కల్లు తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,95,391 మంది సభ్యులున్నారు. తాటిచెట్టు ఎక్కి కల్లు తీసి.. ఆ చెట్టుకిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్‌లైసెన్స్‌లు ఇస్తుంది. ఇలాంటి లైసెన్స్‌లు పొందిన వాళ్లు రాష్ట్రంలో 29,272 మంది ఉండగా.. వాళ్లు 3,541 దుకాణాలను నడుపుతున్నారు. అధికారికంగా ఎక్సైజ్‌శాఖ ఈ లెక్కలు చెబుతున్నా.. అనుమతుల్లేని కల్లు దుకాణాలు అంతకు రెండింతలు ఉంటాయని అంచనా. రెండ్రోజులుగా జరుగుతున్న దాడుల్లోనూ హైదరాబాద్‌లో అనుమతి లేని కల్లు దుకాణాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీకల్లు తయారీదారులు ఎక్సైజ్ సిబ్బందిని మామూళ్ల మత్తులో.. ప్రజలను క్లోరల్ హైడ్రేడ్ మత్తులో దింపేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గీత కార్మికులేరి?
గతంతో పోలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా తాటి చెట్టు ఎక్కి.. కల్లు గీసే గీత కార్మికులు తగ్గిపోతున్నారు. ఉదాహరణకు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్‌లో పదేళ్ల క్రితం 110 మంది గీత కార్మికులు ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 3కు పడిపోయిందని స్థానిక గీత కార్మికుడు బంధం కొండలు తెలిపారు. అలాంటి పరిస్థితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. 2023-24లో గీత కార్మికులకు 53 లక్షల తాటి, ఈత చెట్లు కేటాయించగా.. 2024-25లో కేటాయింపుల సంఖ్య 50 లక్షలకు పడిపోయింది. అంటే.. నిజాయితీగా కల్లు విక్రయించే వాళ్లకు పెద్దగా లాభాలు లేకపోవడంతో గీతకార్మికులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారిస్తున్నారు. కానీ, చెట్లే లేని చోట విచ్చలవిడిగా కల్లు కాంపౌండ్లు కొనసాగుతూ.. రూ.కోట్లలో వ్యాపారం సాగుతుండడాన్ని బట్టి.. కల్తీకల్లు ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
సీజన్ లేకున్నా.. కల్లు ఎక్కడిది..!
తాటి, ఈత చెట్ల నుంచి సీజన్ వారీగా మాత్రమే కల్లు వస్తుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్ఠంగా 12 లీటర్ల కల్లు తయారవుతుంది. వాస్తవానికి డిసెంబరు నుంచి కల్లు తీయడం మొదలు పెడతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కల్లు ఉత్పత్తి బాగా ఉంటుంది. మే, జూన్ నెలల్లో కల్లు ఉత్పత్తి తగ్గుతుంది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో కల్లు ఉత్పత్తి ఉండదు. ఆ నాలుగు నెలల్లో గీత కార్మికులు తాటి, ఈత చెట్లను ఎక్కరు. కానీ.. కల్లు డిపోల్లో మాత్రం అన్ని సీజన్‌లలోనూ నిరంతరాయంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. సీజన్ లేనప్పుడు.. కల్లు ఉత్పత్తి కాకున్నా.. విక్రయాలు ఎలా సాధ్యమనేది ఎక్సైజ్ అధికారులకే తెలియాలి..!
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి