Share News

Hyderabad Metro Rail: కార్పొరేషన్‌గా హైదరాబాద్‌ మెట్రో!

ABN , Publish Date - Dec 23 , 2025 | 10:01 AM

హైదరాబాద్‌ మెట్రో రైల్.. ఇక కార్పొరేషన్‏గా విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఇటీవల విస్తరించారు. 150 ఉన్న వార్డులను 300లకు విస్తరించారు. దీంతో మెట్రో రైలును కూడా విస్తరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Hyderabad Metro Rail: కార్పొరేషన్‌గా హైదరాబాద్‌ మెట్రో!

- స్వయం ప్రతిపత్తి.. నిర్వహణ, నిధులు అంతా కార్పొరేషన్‌కే

- ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తరహాలో ఏర్పాటు

- రెండోదశకు భూసేకరణ అవసరం తక్కువే

- ఎల్‌బీనగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోనే 70 శాతం..

- మిగతా చోట్ల 30 శాతం సరిపోతుందంటున్న హెచ్‌ఏఎంఎల్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దాటి విస్తరించడంతో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌(Metro Rail Network)ను కూడా ఆ మేరకు 400 కి.మీ మేర విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది.


ఢిల్లీలో మెట్రో రైలు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) తరహాలోనే హైదరాబాద్‌ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని చూస్తున్నాయి. మొత్తం పనులన్నీ పూర్తయ్యాక మొదటిదశ, రెండోదశను కార్పొరేషనే పర్యవేక్షించనుంది. ఇక ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండోదశ మెట్రో విస్తరణకు భూ సేకరణ తక్కువ అవసరమవుతుందని, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ (హెచ్‌ఏఎంఎంల్‌) వర్గాలు చెబుతున్నాయి.


నాగోల్‌, ఎల్బీనగర్‌ మీదుగా విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న కారిడార్‌కు, ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మరో కారిడార్‌కు మాత్రమే 70 శాతం భూములను సేకరించాల్సి ఉంటుందని, ఇతర మార్గాల్లో 30 శాతం సరిపోతోందని చెబుతున్నాయి. మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా పార్ట్‌-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కిలో మీటర్ల కోసం రూ.24,269 కోట్లు, పార్ట్‌-బీ కింద ప్రతిపాదించిన 3 కారిడార్లలోని 86.1 కి.మీ కోసం రూ.19,579 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మొత్తం ప్రాజెక్టును 50:50 జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి. మొత్తం ఎనిమిది కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడి నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.


1.20 లక్షల చదరపు మీటర్లతో సెకండ్‌ ఫేజ్‌!

ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలో మొదటిదశ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఎల్‌అండ్‌టీకి ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవల్‌పమెంట్‌ (టీఓడీ) కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలు కేటాయించింది. ఫలక్‌నుమా ప్యాలెస్‌ వద్ద ఇస్తామని చెప్పిన 57 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఎల్‌అండ్‌టీ తమకు ఇచ్చిన 212 ఎకరాల్లోనే కమర్షియల్‌ డెవల్‌పమెంట్‌ చేసింది.


city6.2.jpg

ఇందులో భాగంగా ఆయా భూముల్లో హైటెక్‌ సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారాంబాగ్‌లో ఐదుచోట్ల మాల్స్‌ను నిర్మించింది. ఇంకా కొన్నిచోట్ల ఇప్పటికీ ఖాళీ స్థలాలున్నాయి. రెండోదశలో ప్రతిపాదించిన పనులకు మొత్తం 1.20 లక్షల చదరపు మీటర్ల భూములు అవసరపడతాయని హెచ్‌ఏఎంఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును టేకోవర్‌ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇచ్చిన 212 ఎకరాల ఆదాయ వనరులతోనే సెకండ్‌ ఫేజ్‌ను పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


ఇక మెట్రో రెండోదశలో భాగంగా నాగోల్‌, ఎల్‌బీనగర్‌ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు 36.8 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. రాయదుర్గం నుంచి కోకాపేట్‌ నియోపోలీస్‌ వరకు 11.6 కిలోమీటర్ల మేర, ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర, మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర, ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కిలోమీటర్ల మేర చేపడుతున్నారు. జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కిలోమీటర్ల మేర, జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్ల మేర శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌ ఫ్యూచర్‌సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు.


లీగల్‌ అసె్‌సమెంట్‌కు ఐడీబీఐ కన్సల్టెన్సీ

ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును తీసుకుంటున్న నేపథ్యంలో ఆ సంస్థ అధీనంలో ఉన్న భూములు, ఆస్తులను లీగల్‌గా అసె్‌సమెంట్‌ చేసేందుకు ఐడీబీఐకి కన్సల్టెన్సీ కింద బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో సదరు సంస్థ మదింపు పనులు ముమ్మరం చేసింది. మరో రెండు నెలల్లో లీగల్‌ అసె్‌సమెంట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్‌ అసె్‌సమెంట్‌ కోసం వేరే కన్సల్టెన్సీని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో దీనికి కన్సల్టెన్సీని నియమిస్తామని హెచ్‌ఏఎంల్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.


ఈ ప్రక్రియను మార్చిలోగా ముగించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణీత గడువు విధించింది. కాగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న 7.5 కి.మీ పరిధిలో మొత్తం 880 ఆస్తులను సేకరిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 700 ఆస్తుల సేకరణ పూర్తయినట్లు హెచ్‌ఏఎంఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. మిగతా 180 ఆస్తులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి వచ్చిన వెంటనే మొదటగా ఓల్డ్‌సిటీ కారిడార్‌ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 10:01 AM