Share News

Fraud Malkajgiri: అధిక వడ్డీ ఎరగా వేసి.. 20 కోట్లతో పరారైన మోసగాడు

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:32 AM

బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి ఓ మోసగాడు పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగింది.

Fraud Malkajgiri: అధిక వడ్డీ ఎరగా వేసి.. 20 కోట్లతో పరారైన మోసగాడు

  • వృద్ధులు, సాఫ్ట్‌వేర్‌, విశ్రాంత ఉద్యోగులే టార్గెట్‌

  • మల్కాజిగిరిలో ఘటన

మల్కాజిగిరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి ఓ మోసగాడు పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన దినేశ్‌ పాణ్యం, కవిత పాణ్యం భార్యభర్తలు. వీరి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. దినేశ్‌ పాణ్యం సైనిక్‌పురి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. స్థానికంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని, తాను షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడతానని తమ వద్ద ఉన్న డబ్బును అప్పుగా కానీ, చేబదులుగా కానీ ఇస్తే ప్రతినెలా బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగా ఇస్తానని నమ్మించాడు. అప్పు ఇచ్చిన వారికి ప్రతినెలా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించేవాడు.


ప్రతి నెలా వడ్డీ తమ అకౌంట్లలో పడుతుండడంతో బాగానే ఉందని నమ్మి సుమారుగా 170 మంది ఈ ఉచ్చులో పడ్డారు. ఒక్కొక్కరు లక్షల్లో అప్పుగా ఇచ్చారు. మల్కాజిగిరి పరిసర ప్రాంతాల వాసులే కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు నుంచి అతడు దాదాపు రూ.20 కోట్లు వసూలు చేశాడు. కొన్ని నెలలుగా వడ్డీ అకౌంట్లలో పడకపోవడం, కార్యాలయంలో కూడా ఎవరూ లేకపోవడంతో బాధితులు జూన్‌ 2న కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండు రోజులకే ఆతడి భార్య కవిత పాణ్యం అతడి నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం విశేషం. ఆమెను సంప్రదించగా అతడితో తనకు ఇకపై ఎటువంటి సంబంఽధం లేదని చెబుతోందని బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:32 AM