Hyderabad: నేను చనిపోలేదు.. బతికే ఉన్నా..
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:43 AM
దుండిగల్ గ్రామంలో ఓ పోస్ట్‌మెన్ నిర్వాహకంతో బతికున్న వ్యక్తి తాను చనిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బాధితుడు న్యాయవాది కావడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ గ్రామానికి చెందిన లద్దిపీర్లా అజయ్‌గౌడ్(35) లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
- పోస్ట్‌మెన్ నిర్వాకంతో ఓ అడ్వకేట్‌కు ఇబ్బందులు
హైదరాబాద్: దుండిగల్(Dundigal) గ్రామంలో ఓ పోస్ట్‌మెన్ నిర్వాహకంతో బతికున్న వ్యక్తి తాను చనిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బాధితుడు న్యాయవాది కావడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ గ్రామానికి చెందిన లద్దిపీర్లా అజయ్‌గౌడ్(35) లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల ఇతను నగరంలోని మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ(Chit fund company)లో చిట్ వేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ వారు ఆగస్టు 30వ తేదీన ఇతడికి అగ్రిమెంట్ పేపర్లను కవర్‌లో పెట్టి స్పీడ్ పోస్ట్‌లో పంపించారు.
దుండిగల్ గ్రామ పోస్ట్‌మెన్ ఆ కవర్‌ను అజయ్‌గౌడ్‌కు నేరుగా అందించాల్సి ఉండగా, సరైన విచారణ చేయకుండానే అజయ్‌గౌడ్ చనిపోయాడని రాసి మార్గదర్శి చిట్‌ఫండ్‌కు తిరిగి పంపించాడు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం చిట్‌ఫండ్ కంపెనీ నుంచి అజయ్‌గౌడ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం విన్న అతను ఒక్కసారిగా అవాక్కయ్యాడు. నేను బతికే ఉన్నానని వారికి చెప్పుకున్నాడు.
కాగా, ఇదేమిటని తాను పోస్ట్‌మెన్‌ను ప్రశ్నిస్తే.. ‘‘లెటర్ డెలివరీ చేసేందుకు వస్తే చుట్టుపక్కల వాళ్లు నీవు చనిపోయావని చెప్పారు, అదే తాను రాసి లెటర్‌ను వెనక్కి పంపాను’’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని బాధితుడు వాపోయాడు. పోస్ట్‌మెన్‌పై దుండిగల్ పోలీసులతో పాటు పోస్టల్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయను తెలిపాడు. ఏదేమైనా... బతికున్న అజయ్‌గౌడ్‌కు తాను చనిపోలేదని నిరూపించుకోవాల్సిన దుస్థితి రావడం విచారకరం.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News