Share News

Hyderabad: నా టార్చర్‌కే ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో పోయాడు

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:55 AM

అనుమతి లేకుండా హైకోర్టు న్యాయమూర్తి చాంబర్‌కు వెళ్లడమే కాకుండా తనకు అనుకూలంగా తీర్పు రాయాలంటూ జడ్జిని ఓ కక్షిదారు కోరిన ఘటన హైకోర్టులో కలకలం సృష్టించింది.

Hyderabad: నా టార్చర్‌కే ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో పోయాడు

  • నాకు అనుకూలంగా తీర్పు రాయండి

  • అనుమతి లేకుండా న్యాయమూర్తి చాంబర్‌కు వెళ్లి కక్షిదారు డిమాండ్‌

  • ఓపెన్‌ కోర్టులోనే కేసు విచారిస్తానని చెప్పి పంపిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక

  • విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

  • సీనియర్‌ సిటిజన్‌ కావడంతో ధిక్కరణ చర్యలు చేపట్టని హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా హైకోర్టు న్యాయమూర్తి చాంబర్‌కు వెళ్లడమే కాకుండా తనకు అనుకూలంగా తీర్పు రాయాలంటూ జడ్జిని ఓ కక్షిదారు కోరిన ఘటన హైకోర్టులో కలకలం సృష్టించింది. ‘‘మీరు ఎవరు చెప్తే వింటారు? ఎవరితో చెప్పించమంటారు? నేను కేసు కొనసాగిస్తూ టార్చర్‌ పెట్టడం వల్లే నా ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో చనిపోయాడు. నాకు అనుకూలంగా తీర్పు రాయండి’’ అని అంబర్‌పేట్‌కు చెందిన బి.చెన్నకృష్ణారెడ్డి అనే పిటిషనర్‌ జస్టిస్‌ నగేశ్‌ భీమపాక చాంబర్‌కు వెళ్లి వ్యాఖ్యానించారు. దాంతో, ఓపెన్‌ కోర్టులోనే కేసు విచారిస్తానని.. ఇలా చాంబర్‌కు వచ్చి కేసు గురించి మాట్లాడటం సమంజసం కాదని జడ్జి సదరు పిటిషనర్‌ను పంపించేశారు. సివిల్‌ సూట్‌కు సంబంధించి 2008లో అంబర్‌పేట్‌కు చెందిన చెన్న కృష్ణారెడ్డి హైకోర్టులో అప్పీల్‌ చేశారు. న్యాయవాది లేకుండా ఆయనే (పార్టీ ఇన్‌ పర్సన్‌) వాదించుకున్నారు. గతంలో విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక దానిని కొట్టివేశారు. దాంతో, మళ్లీ ఆయన రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది అదే న్యాయమూర్తి వద్ద విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చెన్నకృష్ణారెడ్డి ఇటీవల జడ్జి చాంబర్‌కు వెళ్లారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇలా జడ్జి వద్దకు వచ్చి.. కేసు గురించి మాట్లాడకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయినా.. సంభాషణ కొనసాగించిన సదరు వ్యక్తి.. తన ఒత్తిడి భరించలేకే ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో చనిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి.. ‘మీ వాదనలు ఓపెన్‌ కోర్టులో వింటామ’ని చెప్పి బయటకు పంపించారు. తాజాగా గురువారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఎదుట విచారణకు వచ్చింది. వ్యక్తిగత హోదాలో హాజరైన పిటిషనర్‌ చెన్నకృష్ణారెడ్డి.. కోర్టు సంప్రదాయాలను పట్టించుకోకుండా.. తీర్పు ఎందుకు ఇవ్వరంటూ ఓపెన్‌ కోర్టులో దురుసుగా మాట్లాడారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరు నా చాంబర్‌కు వచ్చి అనుకూలంగా తీర్పు రాయాలని అడిగారు. కాబట్టి ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నాను. మీ కేసు వేరే జడ్జి విచారిస్తారు. అక్కడికి వెళ్లి మీ వాదనలు వినిపించండి. ’’ అంటూ మండిపడ్డారు. సదరు పిటిషనర్‌ సీనియర్‌ సిటిజన్‌ కావడంతో ధిక్కరణ చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నట్లు తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ ఆదేశాల మేరకు కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం

Read Latest TG News and National News

Updated Date - Sep 05 , 2025 | 04:55 AM