Hyderabad: ఎక్కడమ్మా నువ్వులేనిది.. ఏమిటీ నువ్వు చేయలేనిది..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:32 PM
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మేం ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. గతంలో పోలీస్ ఉద్యోగాల్లోకి రావడానికి మహిళలు ఆలోచించేవారు. తల్లిదండ్రులు సైతం వెనుకడుగు వేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.
- మహిళా శక్తి.. గుర్రాలపై గస్తీ
- అశ్వదళంలో ఉమెన్ పోలీస్ టీం
- పండగలు, ర్యాలీల సమయాల్లో కీలక పాత్ర
- తొలి బ్యాచ్‌లో 10 మందికి శిక్షణ
- గర్వంగా ఉందంటున్న మహిళా మౌంటెడ్ పోలీసులు
హైదరాబాద్ సిటీ: ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మేం ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. గతంలో పోలీస్ ఉద్యోగాల్లోకి రావడానికి మహిళలు ఆలోచించేవారు. తల్లిదండ్రులు సైతం వెనుకడుగు వేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉన్నత చదువులు చదివిన మహిళలు సైతం పోటీపడి పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తున్నారు. అంతటితో ఆగకుండా నేర నియంత్రణలో, నేరస్థులను నిలువరించడంలో, ఆత్మరక్షణలో, భద్రత, బందోబస్తులో పురుషులకు దీటుగా విధులు నిర్వహిస్తున్నారు. వారిలోని శక్తిని, ఆత్మస్థైర్యాన్ని గుర్తించిన సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏఆర్ మహిళా సిబ్బందిలో కొంతమందిని గుర్తించి కరాటేతో పాటు ఆత్మరక్షణ విద్యలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి సరికొత్త స్వాట్ (స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్) టీమ్‌ను తయారు చేశారు. అదే కోవలో ఇప్పుడు మరో పది మందిని ఎంపిక చేసి గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించి మరో టీమ్‌ను సిద్ధం చేశారు.
అశ్వదళంలో 10 మంది మహిళలు
సిటీ మౌంటెడ్ పోలీస్ (ఆశ్వదళం)లో 50 గుర్రాలు ఉన్నాయి. 60 మంది రైడర్‌లు ఉన్నారు. కొన్నేళ్లుగా మౌంటెడ్ పోలీస్ విభాగంలో పురుష పోలీసులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిటీ పోలీస్ అశ్వదళంలో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాలని సీపీ సీవీ ఆనంద్ నిర్ణయించారు. సీపీ ఆదేశాలతో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో ధైర్యవంతులైన 10 మంది ఏఆర్ (ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్) మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. వారికి గోషామహల్‌లోగల మౌంటెడ్ పోలీస్ దళంలో ఉన్న శిక్షకులతో హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ)లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ర్యాలీలు, బందోబస్తుల్లో అశ్వకదళం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్క గుర్రం 20 మంది పోలీసులతో సమానం అని పోలీస్ అధికారులు వెల్లడించారు. హార్స్ రైడింగ్‌లో 10 మంది మహిళా సిబ్బంది 6 నెలలపాటు శిక్షణ పొందారు. శిక్షణలో భాగంగా ప్రతీ శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రోజు విడిచి రోజు ఇద్దరు సిబ్బంది లేక్ పోలీస్ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. పండగలు, ర్యాలీలు, జనసమ్మర్థం ఎక్కుగా ఉండే ఏరియాల్లో గుర్రాలపై గస్తీ నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా వినాయకచవితి, మొహర్రం, హనుమాన్ శోభాయాత్ర వంటి పండగల్లో మౌంటెడ్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తుంటారు.
గుర్రాలకు దాణాగా ఓట్స్, బార్లీ
అవసరాన్ని బట్టి గుర్రాలకు ఆహారం అందించడం, ఇతర నిర్వహణ బాధ్యతలనూ మహిళా సిబ్బంది నేర్చుకున్నారు. ఉదయం 5.30 గంటలకు రోల్‌కాల్‌తో వారి దినచర్య మొదలవుతుంది. ప్రాక్టీస్ అనంతరం ఉదయం 8.30 గంటలకు గుర్రాలకు ఆహారం అందించే సమయం. ఆహారంలో భాగంగా ఓట్స్, బార్లీ, క్యారెట్స్, పచ్చిగడ్డి అందిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News