TG Police: పోలీస్ దొంగలు.. రికవరీ సొత్తు కాజేస్తున్నారు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 09:11 AM
నగరంలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ సిబ్బంది పనితీరుపై వెల్లువలా విమర్శలొస్తున్నాయి. కంచే చేను మేసిందన్న సామెత మాదిరిగా.. చోరీ చేసిన వస్తువులు, సొత్తులో వాటాలు వేసుకుంటూ పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అలాగే.. కొంతమంది సిబ్బంది దొంగలతో దోస్తీ చేస్తున్నారన విమర్శలు కూడా వస్తున్నాయి.
- వెలుగులోకి వస్తున్న వరుస సంఘటనలు
- చోరీ సొత్తులో వాటాలు తీసుకుంటున్న వైనం
హైదరాబాద్ సిటీ: కొంతమంది పోలీసుల తీరు కంచె చేనుమేస్తున్న చందంగా మారింది. చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును కాజేస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇవి పోలీసు శాఖపై మాయని మచ్చగా మిగులుతున్నాయి. వెలుగులోకిరాని కేసులు ఇంకా చాలానే ఉన్నాయి.కొందరు కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న పనులతో పోలీస్ శాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికవరీ సొత్తును బాధితులకు అందించాల్సిన పోలీసులే కాజేసి పట్టుబడ్డారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాష్‌రెడ్డి అప్పులపాలై.. రివకరీ చేసిన 5తులాల బంగారు నగలు, తుపాకీ తాకట్ట్టు పెట్టాడు.
గ్రూప్-2 ఉద్యోగం రావడంతో రిలీవ్ కోసం యత్నించిన సమయంలో తుపాకీ పోయిందని చెప్పాడు. దర్యాప్తులో సదరు ఎస్‌ఐ రికవరీ చేసిన 5 తులాల బంగారునగలు తాకట్టు పెట్టినట్లు తేలింది. దాంతో ఆయనను సస్పెండ్ చేశారు. తుపాకీ ఏమైందనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఐపీఎస్ అధికారినంటూ పలువురిని మోసం చేసిన కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్(39)ను ఫిలింనగర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.

అతడి ఇంట్లో తనిఖీ చేసిన కానిస్టేబుల్ శ్రీరాముల శరణ్‌కుమార్ నకిలీ రాడో వాచ్ చోరీ చేశాడు. ఈ ఘటన రికార్డు కావడంతో, పోలీసు అధికారులు వాచ్ స్వాధీనం చేసుకొని కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం పోలీస్టేషన్‌లో చోరీ కేసులో పోలీసులు రికవరీ చేసిన రూ.1.75 లక్షల విలువైన సెల్ ఫోన్‌ను లాకర్‌లో భద్రపరచగా పోలీసు డ్రైవర్ శ్రవణ్‌కుమార్ కాజేశాడు. ఉన్నతాధికారులు అతడిని ప్రశ్నించగా.. దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
దొంగలతో దోస్తీ
కొంతమంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు దొంగలతో దోస్తీ చేసి, వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చోరీ, స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన దొంగలతో దర్యాప్తులో భాగంగా పరిచయం పెంచుకుని వారితో టచ్‌లో ఉంటున్నారు. చోరీ కేసుల్లో వాటాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు దొంగలు వేరే కేసుల్లో అరెస్టయినా వారికి బెయిల్ ఇప్పించడం, ఆర్థిక సాయం చేస్తూ పరోక్షంగా సహకరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దొంగలకు అండగా ఉంటున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే ఘరానా దొంగలుగా మారతారని పలువురు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News