Share News

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:17 PM

తెలంగాణలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revant on Cyclone Montha

హైదరాబాద్, అక్టోబర్ 29: మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తుపాన్ ఎఫెక్ట్‌పై సంబంధిత అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరిధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో అధిక ప్రభావం ఉందని చెప్పారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్ర‌యాణికుల‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు.


వరదలో చిక్కుకుపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, రిజర్వాయర్ల వద్ద నీటి స్థాయిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. నీటితో నిండిన రోడ్లు, కాజ్‌వేలపై రాకపోకల నిషేధం విధించాలని చెప్పారు. వర్షం కారణంగా పేరుకుపోయిన పారిశుద్ధ్య పనులు, దోమల నివారణకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, విషజ్వరాలు వ్యాపించకుండా తగు చర్యలు త్వరితగతిన తీసుకోవాలన్నారు. వైద్యశాఖ మందులు సిద్ధంగా ఉంచి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.


నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి:

KTR Roadshow: జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్

Hyderabad Rains: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం..

Updated Date - Oct 29 , 2025 | 03:52 PM