Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర!
ABN , Publish Date - May 19 , 2025 | 04:29 AM
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాల(స్లీపర్‌సెల్స్)పై దృష్టి సారించిన పోలీసులు.. హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు.
ఇద్దర్ని అరెస్టు చేసిన రాష్ట్ర, ఏపీ పోలీసులు
నిందితులకు ఐఎ్‌సతో సంబంధాలు
హైదరాబాద్/విజయనగరం, మే 18 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాల(స్లీపర్‌సెల్స్)పై దృష్టి సారించిన పోలీసులు.. హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో.. హైదరాబాద్, విజయనగరం నుంచి ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో హైదరాబాద్ వారాసిగూడకు చెందిన సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్-ఉర్-రెహ్మాన్ ఉన్నారు. సౌదీ అరేబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల(హ్యాండర్లు) నుంచి వీరికి ఆదేశాలు వచ్చినట్లు ఇరురాష్ట్రాల నిఘావర్గాలు గుర్తించాయి. హైదరాబాద్‌లో పేలుళ్ల కోసం వీరు విజయనగరంలో అమ్మోనియం సల్ఫేట్, అల్యూమినియం పౌడర్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో బాంబులను తయారు చేశారని నిర్ధారించాయి. ఇలా తయారు చేసిన బాంబులను పరీక్షించేందుకు కొన్ని ప్రదేశాలను వీరు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో వీరి టార్గెట్ ఏమిటి? ఎక్కడ పేలుళ్లకు కుట్రలు పన్నారు? ప్రత్యక్ష్యంగా.. పరోక్షంగా ఎవరెవరు సహకరిస్తున్నారు? అనే కోణాల్లో వీరిని విచారించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పోలీసు శాఖలో కుటుంబం
సిరాజ్-ఉర్-రెహ్మాన్ తండ్రి, సోదరుడు పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్నట్లు విజయనగరం పోలీసులు చెప్పారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం వద్ద వీరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ బీటెక్ పూర్తిచేసి, హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉద్యోగాలు చేశాడు. ఆ సమయంలోనే ఇతనికి ఉగ్రవాద మాడ్యూల్స్‌తో పరిచయం ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎస్ సూచనలతో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాడని అనుమానిస్తున్నారు. ఇతను ఆన్‌లైన్‌లో అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాతే నిఘా విభాగాలు ఇతని కార్యకలాపాలపై ఆర్నెల్లుగా కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇతను సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు అనుకూల పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇతణ్ని విచారించాకే.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ వెంటనే హైదరాబాద్ పోలీసులు సమీర్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఉదంతంతో విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను వీరు టార్గెట్‌గా చేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News