Hyderabad: ‘కామన్ మొబిలిటీ కార్డు’ ఎప్పుడిస్తారో...
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:12 AM
హైదరాబాద్ నగర వాసులు కామన్ మొబిలిటీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్డులల జారీపై అధికార యంత్రాంగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పలువురిలో నిరాశ ఎదురవుతోంది. ఈ కార్డు ద్వారా ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యం ఉంటుంది.
- మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి కార్డుపై నగరవాసుల నిరీక్షణ
- గత ప్రభుత్వం ప్రకటించినా పట్టించుకోని పరిస్థితి
- రెండింటికీ ఒకే కార్డు ఉంటే టికెట్ రహిత ప్రయాణం
- నెలవారీగా రీచార్జీ చేయించుకుంటే సులువుగా రాకపోకలు
హైదరాబాద్ సిటీ: ‘కామన్ మొబిలిటీ కార్డు’ కోసం నగరవాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒకే కార్డుతో ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీని ఒకే గొడుకు కిందకు తెచ్చి ప్రజలకు టికెట్ రహిత ప్రయాణాన్ని అందించాలని గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవంగా 2023 ఆగస్టులోపు ఈ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించినప్పటికీ ఆచరణలో అధికారులు విఫలమయ్యారు.
దీంతో ప్రయాణికులు ఎప్పటిలాగే మెట్రో, ఆర్టీసీకి సంబంధించి వేర్వేరుగా టికెట్లు తీసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రోరైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రోజుకు సగటున 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 12 గంటల వరకు నడుస్తున్న 3,200 ఆర్టీసీ బస్సుల్లో సుమారు 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 2 లక్షల మంది విద్యార్థులు, 2 లక్షల మంది ఉద్యోగులు, ఇతరులు బస్‌పా్‌సలను వినియోగిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు.
ఇప్పటికే అమలులో ఎంఎంటీఎస్-బస్‌పాస్..
నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ నాంపల్లి, ఫలక్‌నుమా కారిడార్లలో(Secunderabad, Kacheguda, Nampally, Falaknuma corridors) ప్రస్తుతం రోజుకు 76 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. కరోనాకు ముందు రోజుకు 128 సర్వీసులను నడిపించారు. అప్పట్లో రోజుకు 1.68 లక్షల మంది ఆయా మార్గాల్లో ప్రయాణించారు. ప్రస్తుతం 76 రైళ్లలో గరిష్ఠంగా 32వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంఎంటీఎస్ రైళ్లు దిగిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలు, ఇళ్లకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండే ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా ఎంఎంటీఎస్ బస్‌సా్‌సలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో రూ.800 పెట్టి బస్‌పాస్ తీసుకుంటే అటు ఎంఎంటీఎస్ లో, ఇటు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రహిత ప్రయా ణాన్ని సాగించే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం దీని ధర నెలకు రూ.1,350 పెంచారు.
కామన్ మొబిలిటీ కార్డుతో ప్రయోజనాలు
మెట్రో, ఆర్టీసీకి కలిపి కామన్ మొబిలిటీ కార్డును అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనుసంధానంగా జారీ చేయనున్న కామన్ మొబిలిటీ కార్డు తొలి దశలో విజయవంతమైతే తర్వాత దశలో ఎంఎంటీఎస్ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోల్లో కూడా ఉపయోగించుకునే విధంగా విస్తరించవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా వినియోగించుకునే విధంగా ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటే బహుళ సౌకర్యాలుంటాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News