Share News

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:11 AM

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ నడవాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేసింది.

ఎమ్మెల్యే  కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విచారణ ఎదుర్కోవాలని స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ నడవాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేసింది. మనోజ్‌రెడ్డిని బెదిరించిన వ్యవహారంపై హనుమకొండ సుబేదారి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం సోమవారం డిస్మిస్‌ చేసింది.


డబ్బుల కోసం తన భర్తను కౌశిక్‌ రెడ్డి తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొంటూ క్వారీ యజమాని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఈనెల 10వ తేదీన తీర్పు రిజర్వు చేసింది. విచారణను ఎదుర్కోవాలంటూ తాజాగా తీర్పు వెలువరించింది. కాగా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై నమోదైన ఓ ఎన్నికల కేసులో కరీంనగర్‌ మేజిస్ట్రేటు కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు మినహాయుంపు ఇచ్చింది.

Updated Date - Jun 17 , 2025 | 05:11 AM