Share News

HISFF: దేశంలోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌ స్టేట్‌గా తెలంగాణ నిలవాలి: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Dec 19 , 2025 | 07:41 PM

దేశంలోనే ఫిల్మ్ మేకర్స్‌కి బెస్ట్ స్టేట్‌గా తెలంగాణను మార్చాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు నగరంలో జరిగిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(HISFF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

HISFF: దేశంలోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌ స్టేట్‌గా తెలంగాణ నిలవాలి: మంత్రి కోమటిరెడ్డి
HISFF 2025

హైదరాబాద్, డిసెంబర్ 19: దేశంలోనే ఫిల్మ్ మేకర్స్‌కి బెస్ట్ స్టేట్‌గా తెలంగాణను మార్చాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు నగరంలో జరిగిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(HISFF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెంకట్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2025.. మన హైదరాబాద్‌కు, మన తెలంగాణకు ఒక మంచి ఆరంభం అని పేర్కొన్నారు. హైదరాబాద్ అంటేనే సినిమాగా పేరుగాంచిందన్నారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద సినిమాలు ఒకవైపు.. షార్ట్ ఫిల్మ్స్ మరోవైపు తీయడం వల్ల హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు మరింత పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కొత్త టాలెంట్ ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వస్తోందన్నారు మంత్రి. షార్ట్ ఫిల్మ్స్ యువతకు ఫ్రీడమ్ ఇస్తాయని.. కొత్తగా ఆలోచించడానికి.. కొత్తగా ట్రై చేయడానికి.. తమ కథని తమ స్టైల్‌లో చెప్పడానికి.. అవకాశాన్ని కల్పిస్తాయన్నారు కోమటిరెడ్డి.


ఈ రోజు పెద్ద స్థాయిలో ఉన్న చాలామంది ఫిల్మ్ మేకర్స్ మొదట షార్ట్ ఫిల్మ్స్‌తోనే మొదలుపెట్టారని గుర్తు చేశారు మంత్రి. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నానని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన. ‘మంచి టాలెంట్‌కు అవకాశం రావాలి.. యువ ఫిల్మ్ మేకర్స్ ముందుకు రావాలి.. వాళ్లకు సరైన ప్లాట్‌ఫామ్ ఉండాలి.. అదే మా ప్రభుత్వ ఆలోచన.’ అని ఉద్ఘాటించారు మంత్రి కోమటిరెడ్డి. తమ లక్ష్యం చాలా సింపుల్ అని.. దేశంలోనే ఫిల్మ్ మేకర్స్‌కి బెస్ట్ స్టేట్‌గా తెలంగాణను మార్చాలన్నారు.


‘అనుమతులు ఈజీగా ఉండాలి. సదుపాయాలు బాగుండాలి. అందుకోసం ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోంది. ఈ ఫెస్టివల్‌లో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం ఒకటి ఉంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ పాల్గొనడం. ఎనిమిది రాష్ట్రాల కథలు ఇక్కడ మనం చూస్తున్నాం. హైదరాబాద్ అంటే మినీ ఇండియా. ఇలాంటి కార్యక్రమాలు మన దేశాన్ని ఇంకా దగ్గర చేస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఫిల్మ్ మేకర్‌కు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. అవార్డు వచ్చినా రాకపోయినా.. మీ కథకి విలువ ఉంది. 15-20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కూడా మనసులను తాకగలదు. ధైర్యంగా కొత్త కథలు చెప్పండి. ముందుకు వెళ్లండి.’ అంటూ యువ ఫిల్మ్ మేకర్స్‌లో ఉత్తేజాన్ని నింపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాగా, ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంక, నిర్వాహకులు ఉమా మహేశ్వరరావు, ఇతర ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.


Also Read:

కళ్ళ కింద నల్లటి వలయాలను ఇలా వదిలించుకోండి

బిగ్ అలర్ట్.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ల వాడకంపై పరిమితి..

ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో..

Updated Date - Dec 19 , 2025 | 07:41 PM