Share News

Telangana High Court: స్థానిక ఎన్నికలకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:46 AM

ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...

Telangana High Court: స్థానిక ఎన్నికలకు బ్రేక్‌

  • బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే.. 50% మించరాదన్న వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం

  • నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ

  • సర్కారుకు నోటీసులు.. కౌంటర్‌కు 4 వారాల గడువు

  • పిటిషనర్ల సమాధానానికి మరో 2 వారాలు

  • ఆరు వారాల పాటు విచారణ వాయిదా

  • బీసీల ఇంప్లీడ్‌ పిటిషన్లు విచారణకు స్వీకరణ

  • రాష్ట్రపతి వద్ద 3 నెలలుగా 42% రిజర్వేషన్ల బిల్లులు

  • ఇటీవలి సుప్రీం తీర్పు నేపథ్యంలో అవి చట్టాలైనట్లే..

  • నోటిఫికేషన్‌ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోలేవు

  • 50% పరిమితి రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు

  • ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదీర్ఘ వాదన

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జీవోపై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం రిజర్వేషన్లు 50ు దాటరాదని సుప్రీంకోర్టు విధించిన పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్న పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు, ప్రభుత్వ కౌంటర్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ నాయకులు, బీసీ సంఘాలు దాఖలు చేసిన దాదాపు 60 ఇంప్లీడ్‌ పిటిషన్‌లను విచారణకు స్వీకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి, తదితరులు హైకోర్టులో దాదాపు 10 పిటిషన్‌లు దాఖలు చేశారు. బుధవారం వాదనలు ముగియక పోవడంతో గురువారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.


బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేసిందని తెలిపారు. ‘‘స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, కుల సర్వే చేపట్టాం. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్‌ టెస్ట్‌ అమలులో భాగంగా బీసీల రాజకీయ, సామాజిక వెనుకబాటును అంచనా వేయడం కోసం ఇంటింటి కుల సర్వే చేపట్టాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా 57.6 శాతం వెనుకబడిన వర్గాలు ఉన్నట్లు సర్వేలో తేలిసింది. సర్వే రిపోర్ట్‌ను ప్రభుత్వ అవసరం కోసం కాబట్టి దానిని ఎవరికీ చూపాల్సిన అవసరం లేదు. సర్వే నివేదికలోని ఎంపరికల్‌ డేటా ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే విద్య- ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు బీసీ బిల్లులను అసెంబ్లీలో పెట్టింది. బిల్లులు ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. గవర్నర్‌ వాటిని రాష్ట్రపతికి పంపారు. పంచాయతీరాజ్‌ చట్టం- 2018లోని 285(ఏ)లో ఉన్న రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న గరిష్ఠ పరిమితిని ఎత్తేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పరిణామక్రమంలో ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి మార్చేందుకు దాన్ని అసెంబ్లీలో పెట్టారు. ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఉభయ సభల ఆమోదం పొందింది. మరో కేసులో రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులను గవర్నర్‌, రాష్ట్రపతి మూడు నెలల్లో ఆమోదించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినట్లే. అవి చట్టాలుగా అమల్లోకి కూడా వచ్చినట్లే భావించాలి. వాటిని మళ్లీ ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. అలాగే పంచాయతీరాజ్‌ సవరణ చట్టం సైతం ఆమోదం కోసం గవర్నర్‌ దగ్గరకు వెళ్లింది. దానిని గవర్నర్‌ రాష్ట్రపతికి పంపారు. ఆ సవరణకు మూడు నెలలు నిండకపోయినా అంతకు ముందు 285(ఏ)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఇప్పటికీ అమలులో ఉంది. ఆర్డినెన్స్‌ జారీ చేస్తే అది ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. ఇప్పటికీ ఆర్డినెన్స్‌ అమలులో ఉంది కాబట్టి 285(ఏ)లో 50 శాతం గరిష్ఠ పరిమితి అమలులో లేదు.


అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశాం. 2019లో (బీఆర్‌ఎస్‌ హయాంలో) పంచాయతీరాజ్‌ చట్టంలో 285 (ఏ)లో 50 శాతం గరిష్ఠ పరిమితి విధిస్తూ చట్టసవరణ చేసినప్పుడు గవర్నర్‌ వెంటనే ఆమోదించారు. అదే సెక్షన్‌కు ఇప్పుడు సవరణ చేస్తే మాత్రం గవర్నర్‌ ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి పంపారు. 50 శాతం గరిష్ఠ పరిమితిని చట్టంలో చేర్చడం ఒక వ్యతిరేక చర్య. ఎవరైనా రిజర్వేషన్‌ అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అని చెప్తారే కానీ ఇంతకు మించి ఇవ్వం అని చట్టంలో చేరుస్తారా? అదొక నెగిటివ్‌ ప్రొవిజన్‌. ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లు చట్టాలుగా మారి అమలులో ఉండటంతో పాటు ఆర్డినెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌ సవరణ చట్టం అమలులో ఉంది. స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలోని అంశం. దానిపై చట్టాన్ని రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఏముంది? బీసీలకు 2025 లెక్కల ప్రకారం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం రిజర్వేషన్‌ ఇస్తారా ? అని పిటిషనర్డు అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్‌ ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఇప్పటికీ 2011 జనాభా లెక్కలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. బీసీల కులాల లెక్కలు ఎప్పుడూ తీయలేదు. ఇదే తొలిసారి కాబట్టి ప్రస్తుత సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. దీనిని వ్యతిరేకించడం సరికాదు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా బీసీ బిల్లులను, రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు. ఇది రాష్ట్ర ప్రజల అభీష్టం. దానిని అడ్డుకోలేం. బిల్లుల ఆమోదం ముఖ్యం కాదు. రాష్ట్ర శాసన వ్యవస్థకు శాసన అధికారం(లిజిస్లేటివ్‌ కాంపిటెన్స్‌) ఉందా? లేదా? అనేది ముఖ్యం. ప్రస్తుత చట్టాలు చేయడానికి వంద శాతం రాష్ట్ర అసెంబ్లీకి శాసనాధికారం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై జోక్యం చేసుకోరాదు. అలాగే రాజ్యాంగంలోని 243(ఓ)లో నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఏ వివాదం ఉన్నా ఎన్నికల పిటిషన్‌ల రూపంలో తేల్చుకోవాలని స్పష్టమైన నిర్దేశం ఉంది. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే పిటిషన్లు దాఖలైనా సరే జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.


ఇంద్రసహానీ తీర్పులో పెట్టిన 50 శాతం పరిమితి రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు’ అని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే మరో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రవివర్మ వాదించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ మాత్రమేనన్నారు. కే కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ పరిమితికి రాజ్యాంగబద్ధత లేదని చెప్పారు. 15 శాతం కూడా లేని ఇతర కులాలకు 33 శాతం ఓపెన్‌ క్యాటగిరీ ఉన్నప్పుడు పిటిషనర్లకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Oct 10 , 2025 | 06:29 AM