Share News

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:51 AM

రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్‌ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది.

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్‌ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది. మహారాష్ట్రలోని మహూర్‌లో ఉన్న ‘ఏకవీర దేవికా’ ఆల యానికీ, దీనికి పోలిక ఉంది. అక్కడ రేణుకా మాతకు... ఇక్కడ రేణుకా ఎల్లమ్మకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. కాకతీయుల ‘ఏకవీర’గా చెప్పుకునే ఆలయ విశేషాలివి...

కాసే సర్వప్ప రచించిన ‘సిద్ధేశ్వర చరిత్ర’లో కాకతీయ రుద్రదేవుడు (క్రీ.శ.1042 నుంచి 1130) మహాశక్తికి గుడి కట్టించినట్లు ఉంది. వరంగల్‌ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో మొగిలిచర్ల గ్రామంలో ఈ ‘ఏకవీర’ దేవాలయం ఉంది.


వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం వంటి పురాతన గ్రంథాల్లో కూడా ఈ దేవాలయంపై ప్రత్యేక ప్రస్తావనలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గర్భ గుడి అంతరాలు చిన్న గదులుగా 28 స్తంభాలతో విశాలమైన అర్ధమంటపంతో కూడిన దేవాలయం ఇది. ఎనిమిది పెద్ద స్తంభాలు ఉండగా, మధ్యలో నాలుగు, గర్భ గుడి ముందు రెండు, దాని లోపల రెండు స్తంభాల చొప్పున ఏర్పాటు చేశారు. మరో 20 చిన్న స్తంభాలు ఆలయానికి తూర్పు వైపున ఉన్నాయి. మొత్తంగా ఈ ఆలయం శిలా ఫలకంపై నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.


అలాగే దేవాలయానికి ముందు 20 అడుగుల దూరంలో ఉన్న ఇసుక రాతి గుండ్లను తొలిచి చేసిన గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రెండింటిలోనూ పానవట్టాలు, లింగ ప్రతిష్ట కొరకు తొలిచిన గుంటలు ఉన్నాయంటున్నారు. ఒకదానిలో రాతి అరుగునే పానపట్టంగా మార్చి శివలింగ ప్రతిష్ట చేసినట్టుగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ రెండు రాతి గుహల నడుమ మరొక గుండుకు తొలచిన అర్ధశిల్పా మంటపాలు దీర్ఘ చతుర ప్రాకారాలుగా ఉన్నాయి. తొలుత జైనులైన కాకతీయ పాలకులు శైవులుగా మారడంతో ఎన్నో జైన దేవాలయాలు శైవాలయాలుగా మారాయి. ‘మొగిలిచర్ల కూడా ఒకప్పటి జైన స్థానమేనని చెప్పడానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయ’ని చరిత్రకారుడు అరవింద్‌ ఆర్య పేర్కొన్నారు.


book5.2.jpg

రుద్రమదేవి యుద్ధతంత్రాలు ఇక్కడే...

రాణి రుద్రమదేవికి పట్టాభిషేకం పూర్తయిన తరువాత ఐదు రాత్రులు నిద్రపోకుండా... పంచ రాత్ర వ్రతం ఈ ‘ఏకవీర’ ఆలయంలోనే చేసినట్లుగా చారిత్రక కథలున్నాయి. రుద్రమ దేవి కాలంలో ఏకవీర ఆలయంలో నిత్యం పూజలు, హోమాలు జరిగేవి. ఇక్కడే కాకతీయ సైన్యానికి యుద్ధతంత్రాలపై శిక్షణ ఇచ్చేవారట. హరిహరదేవుడు, మురారి దేవుడు తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిన రుద్రమదేవి... వారిని మొగిలిచర్ల వద్దనే నిలువరించి, ఓడించి, బంధించింది. రుద్రమ ఏకవీరాదేవి గుడికి వెళ్తున్నపుడు దేవగిరి రాజు మహదేవుడు అడ్డగించి యుద్ధానికి దిగాడు. వారిని రుద్రమదేవి తరిమికొట్టింది ఇక్కడి నుంచే అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆలయం నుంచి వరంగల్‌ కోట వరకు రహస్య సొరంగం ఉందనిఅంటున్నారు. ఈ ప్రాంతం సైనికులకు శిక్షణ కేంద్రంగా ఉండటంతో... కాకతీయ పాలకులు ఈ రహస్య సొరంగం నుంచే ఇక్కడికి తరుచూ వచ్చేవారని చెబుతున్నారు.


రెండింటికీ పోలిక...

విషాదం ఏమిటంటే... ఈ ఆలయంలో ఏకవీర దేవి విగ్రహం అపహరణకు గురైంది. ప్రస్తుతం ఆలయంలో అనేక విగ్రహలతో పాటు రేణుకా ఎల్లమ్మ విగ్రహం ఉంది. కుండలాలు, కంఠాభరణాలు, దండకడియాలతో వీరాసనంలో కూర్చోని ఉన్న ఎల్లమ్మ శిల్పం ఉంది. నడుముకు కిందిభాగాన వస్త్రం చెక్కి ఉంది. కుడిముంజేత ఖడ్గం, వెనుక కుడిచేత ఢమరుకం, ఎడమ చేతిలో పానపాత్ర, వెనుక ఎడమ చేత త్రిశూలం చెక్కి ఉన్నాయి. అయితే ఇదే తరహాలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఎనిమిదో పీఠంగా మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా మహూర్‌లోని ఏకవీరదేవికా ఆలయం ఉంది.


ఇక్కడ ఆలయం చాలా చిన్నదిగా ఉండటంతో... పక్కనే ఉన్న రేణుకా మాతనే శక్తిపీఠంగా కొలుస్తారు. మొగిలిచర్ల ఏకవీర ఆలయంలో రేణుకా ఎల్లమ్మ... మహూర్‌లోని ఏకవీర ఆలయంలో రేణుకా మాతలను కొలవటం యాదృచ్ఛికమే అయినప్పటికీ... అక్కడి శక్తిపీఠంతో ఈ ఆలయానికి పోలికలు ఉండటంపై చరిత్ర కారులు పరిశోధనలు చేస్తున్నారు.

అయితే ఈ చారిత్రాత్మక ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయంలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాల్లో అనేక విగ్రహాలు, ఆలయ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఈ ఆలయం పునరుద్ధరణతో పాటు ఏకవీర దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే... చరిత్రకు నగిషీలు చెక్కినట్టే.

- తడుక రాజనారాయణ, వరంగల్‌

ఫొటోలు: వీరగోని హరీష్‌


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2025 | 09:51 AM