Share News

Mulugu Waterfalls: ములుగు.. జలపాతాల సొబగు!

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:29 AM

ములుగు జిల్లా ప్రకృతి అందాలకు నెలవు. పర్యాటకులను కట్టిపడేసే సహజ సౌందర్యం ఇక్కడుంది. ...

Mulugu Waterfalls: ములుగు.. జలపాతాల సొబగు!
Mulugu Waterfalls

  • జిల్లాలో ఏకంగా 8 జలపాతాలు..

  • ప్రతి ఏటా వానాకాలంలో కనువిందు

  • బొగత మినహా మిగతావాటికి వెళ్లాలంటే అటవీ అధికారుల అనుమతి ఉండాలి

  • అన్ని జలపాతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలంటున్న ప్రకృతి ప్రేమికులు

  • కేంద్రం దృష్టిలో కర్రెగుట్టలు..

  • పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు

  • అలా చేస్తే ఈ జలపాతాలకూ సందర్శకుల తాకిడి పెరిగే అవకాశాలు

ములుగు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా ప్రకృతి అందాలకు నెలవు. పర్యాటకులను కట్టిపడేసే సహజ సౌందర్యం ఇక్కడుంది. రామప్ప ఆలయంలో కాకతీయుల కాలం నాటి శిల్పాలు, అహ్లాదాన్ని పంచే లక్నవరం, రామప్ప సరస్సులు, మేడారం సమ్మక్క, సారలమ్మ, రామప్ప, మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలు.. ఇలా విభిన్న రకమైన అంశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వీటితోపాటు వానాకాలంలో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే జలపాతాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. ఈ జలపాతాల్లో పాలనురగల్లా జాలువారే నీటిధారలను చూసిన వారు మంత్రముగ్ధులవుతుంటారు. ములుగులో 8 జలపాతాలు ఉండగా పర్యాటకులు సందర్శించడానికి ప్రభుత్వం నుంచి కేవలం బొగతకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇక మిగతా జలపాతాల పేర్లు.. బామణిసరి, మాసలొద్ది, దుస్సపాటిలొద్ది, గుండం, ఏనుగుసరి, మహితాపురం, ముత్యంధార. బావణిసరి, మాసలొద్ది, దుస్సపాటిలొద్ది, గుండం, ఏనుగుసరి, బొగత జలపాతాలు వాజేడు మండలంలో ఉంటే.. మమితాపురం, ముత్యంధార జలపాతాలు వెంకటాపురం మండలంలో ఉన్నాయి.

బ్లూ వాటర్‌ ఫాల్‌..

వాజేడు మండలంలోని మరో జలపాతం మాషేనులొద్ది. ఈ జలపాతాన్ని పర్యాటకులు బ్లూ వాటర్‌ ఫాల్‌గా పిలుస్తారు. ఈ జలపాతంలోని నీళ్లు నీలిరంగులో కనిపించి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఈ జలపాతాన్ని చూడాలనుకునేవారు దూలాపురం నుంచి మూడు కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో ఒక కిలోమీటరు మేర ట్రెక్కింగ్‌ చేసుకుంటూ పోవాలి. అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. మరో జలపాతం ఏనుగుసరి(ఏనుగుసారు) జలపాతం. మురుమూరు నుంచి 5కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ పోతే జలపాతం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లాలనుకునేవారు అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. వాజేడు మండలంలోని మరో జలపాతం గుండం జలపాతం. ఇటీవలే ఈ జలపాతం వెలుగులోకి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. వాజేడు మండలంలోని కృష్ణాపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలోగల బామణిసరి జలపాతానికి వెళ్లాలన్నా అటవీ శాఖ అధికారుల అనుమతులు అవసరం.

ట్రెక్కింగ్‌ చేయాల్సిందే..

దట్టమైన అడవులు, కొండల మధ్య నుంచి హోరెత్తుతూ వచ్చే నీటి హొయలు నేలకు జాలువారే జలపాతం బొగత. 30 అడుగుల ఎత్తైన కొండ నుంచి నీళ్లు కిందకు దూకే ఈ జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జూలై నుంచి నవంబరు వరకు ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. శని, ఆదివారాల్లో, పండగ సెలవుల్లో రోజుకు 5వేల నుంచి 10 వేల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి పోతుంటారు. ఈ జలపాతం వరంగల్‌ నుంచి 130 కిలో మీటర్ల దూరంలో ఉంది. బొగత సమీపంలోనే దుస్సపాటిలొద్ది(కొంగల) జలపాతం ఉంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడే ఈ జలపాతాన్ని గోదావరి గిరిజన ప్రాంతంలోని రహస్య రత్నంగా చెప్పవచ్చు.


జూలై నెల నుంచి సెప్టెంబరు వరకు ఇక్కడికి పర్యాటకులు వచ్చి పోతుంటారు. జలపాతం చూడాలనుకునే వారు కొండలను ఎక్కాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఉండే అవకాశం ఉన్నందున ఇక్కడికి వచ్చే వారు ఫారెస్టు అధికారుల అనుమతి తీసుకోవాలి.

FXGN.jpg

700 అడుగుల ఎత్తు నుంచి..

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ముత్యంధార జలపాతం ఉంది. ఇక్కడ నీళ్లు 700 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడతాయి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ముత్యంధార జలపాతం వెళ్లాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తప్పనిసరి. వెంకటాపురం మండలంలోని మరో అద్భుతమైన జలపాతం మహితాపురం. ఇక్కడ 120 అడుగుల ఎత్తునుంచి నీళ్లు కిందకు పడతాయి. అయితే ఈ 8 జలపాతాల్లో కేవ లం బొగత సందర్శనకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. మిగిలిన ఏడు జలపాతాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి, పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రభుత్వ అనుమతులిస్తే బాగుంటుందని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం వాజేడు, వెంకటాపురం మండలాల సరిహద్దుల్లో గల కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవల ఈ మండలాల్లో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కర్రెగుట్టలు పర్యాటక ప్రాంతంగా మారితే వాటికి సమీపంలోని ఈ జలపాతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుందని, ఫలితంగా ములుగు జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశముందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 09:56 AM