Share News

Heavy Rains: ఈదురు గాలులతో భారీ వర్షం.. ఆందోళనలో రైతులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:22 PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. ఉదయం నుంచి కుండపోత వానలు కురిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

Heavy Rains: ఈదురు గాలులతో భారీ వర్షం.. ఆందోళనలో రైతులు
Heavy Rains Lash Warangal

వరంగల్, నవంబర్ 4: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. ఉదయం నుంచి కుండపోత వానలు కురిశాయి. వరంగల్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు చెరువులను తలపించాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్న తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏర్పడ్డ 'మొంథా' తుపాను ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. మరోసారి వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంత ప్రజల్లో ముంపు భయం నెలకొంది.


వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, మేడ్చల్ - మల్కాజిగిరి, యాదాద్రి - భోంగీర్ వంటి పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.


వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్, సంబంధిత అధికారులతో కలిసి జీడబ్ల్యూఎంసీ (GWMC) పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్‌లో క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. నాళాల భౌతిక స్థితి పరిశీలించి, వరద నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాల సూచించారు.


ఇవి కూడా చదవండి:

MLA's Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు

Hyderabad: ‘చేవెళ్ల’ మృతుల్లో కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినులు

Updated Date - Nov 04 , 2025 | 12:31 PM