Nizam Sagar: గోదావరికి పెరిగిన వరద
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:08 AM
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు మోస్తరు నిల్వలతోనే ఉన్న గోదావరి జలాశయాలు ఇప్పుడు నిండు కుండల్లా మారుతున్నాయి.
మేడిగడ్డకు 5.66 లక్షల క్యూసెక్కులు..
శ్రీరాంసాగర్‌కు 1.51 లక్షలు..
నాగార్జునసాగర్, శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు మోస్తరు నిల్వలతోనే ఉన్న గోదావరి జలాశయాలు ఇప్పుడు నిండు కుండల్లా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1,51,806 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద కాల్వకు 5 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64 టీఎంసీల నీరు ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 43 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. 17 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రాజెక్టులో 12 టీఎంసీల నిల్వ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి 5.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34 అడుగులకు చేరింది. ఇక కృష్ణా నదిపై గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 11 గేట్ల ద్వారా 77,946 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,818 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 1,78,101 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మూడు గేట్లను ఎత్తి 79,269 క్యూసెక్కులను, రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 65,807 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 1,45,076 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 1,70,588 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 303 టీఎంసీల నీరు ఉంది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం..
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లాలోని 12 మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తాంసిలో 17.2, తలమడుగులో 16.4, మావలలో 16, సాత్నాలలో 15.6, సిరికొండలో 14.8, గుడిహత్నూర్‌లో 14.7, ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 14.4, ఇంద్రవెల్లిలో 13.7, బోరాజ్‌లో 13.6, జైనథ్‌లో 13, ఇచ్చోడలో 12.6, ఆదిలాబాద్ రూరల్‌లో 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో ఆదివారం వర్షాలు దంచి కొట్టాయి. సారంగాపూర్ మండలంలో 13 సెం.మీ, తానూర్ మండలంలో కూడా 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రాత్రి 8.50 నుండి 10 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం సాయంత్రం జోరువాన కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి.
జలపాతంలో గల్లంతైన యువకుడి మృతి..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన పామర్తి ప్రేమ్‌కుమార్(23) శనివారం ఏడుబావులకు వచ్చాడు. అక్కడ సెల్ఫీ దిగే క్రమంలో జలపాతంలో పడిపోయాడు.
నేడు, రేపు అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్.. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ