Share News

Health University: మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా?

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:12 AM

తన పరిధిలోకి వచ్చే మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి ఉంటుందా’’ అని హైకోర్టు ప్రశ్నించింది.

Health University: మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా?

  • కాళోజీ హెల్త్‌ వర్సిటీకి హైకోర్టు ప్రశ్న

  • ఇటీవల చల్మెడ కాలేజీలో హెల్త్‌ వర్సిటీ అధికారుల తనిఖీలు.. భారీగా లోపాలు

  • కాలేజీపై రూ.కోటి జరిమానా

  • అభ్యర్థనతో రూ.20 లక్షలకు తగ్గింపు

  • వర్సిటీ నోటీసు చెల్లదంటూ హైకోర్టుకు చల్మెడ ఆనందరావు కాలేజీ

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘తన పరిధిలోకి వచ్చే మెడికల్‌ కాలేజీలపై జరిమానా విధించే అధికారం కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి ఉంటుందా’’ అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు రూ.20 లక్షల జరిమానా కట్టాలని చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీపై ఒత్తిడి తేవొద్దని వర్సిటీని ఆదేశించింది. ఇటీవల చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీలో కాళోజీ వర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించారు. ఇందుకు గాను రూ.కోటి జరిమానా విధించారు. జరిమానాను తగ్గించాలని కాలేజీ యాజమాన్యం కోరడంతో రూ.20 లక్షలకు తగ్గిస్తూ, ఈ మొత్తాన్ని 7రోజుల్లోగా చెల్లించాలని జూలై 30న నోటీసు ఇచ్చారు. అయితే, ఈ నోటీసు చెల్లదని చల్మెడ మెడికల్‌ కాలేజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. చిన్న చిన్న లోపాలను కారణాలుగా చూపిస్తూ జరిమానా విధించే అధికారం హెల్త్‌ యూనివర్సిటీకి లేదని అన్నారు.


ఎలాంటి అధికార పరిధి లేకపోయినా జరిమానాలు విధించడం ప్రాథమిక హక్కులకు, సహజన్యాయసూత్రాలకు వ్యతిరేకమన్నారు. హెల్త్‌ వర్సిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. మెడికల్‌ కాలేజీలో యూనివర్సిటీ అధికారులు భారీ లోపాలు గుర్తించారని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాల్సి ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రూ.కోటి జరిమానా విధించారని చెప్పారు. జరిమానా తగ్గించాలని కాలేజీ విజ్ఞప్తి చేయడంతో దాన్ని రూ.20 లక్షలకు తగ్గించారన్నారు. జరిమానా తగ్గించాలని ఒకవైపు విజ్ఞప్తి చేసి, జరిమానా తగ్గించిన తర్వాత పిటిషనర్‌ కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. జరిమానా విధించే అధికారం హెల్త్‌ యూనివర్సిటీకి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. జరిమానా విధించే అధికార పరిధి హెల్త్‌ యూనివర్సిటీకి ఉం దా. .లేదా? అనేది ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఈ విషయం తేలేవరకు రూ.20 లక్షల జరిమానా విధించడంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానా తప్ప మెడికల్‌ కాలేజీకి హెల్త్‌ యూనివర్సిటీ ఇచ్చిన నోటీసు యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 04:12 AM