Hyderabad: అక్రమ కేబుళ్లన్నీ తొలగించండి
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:36 AM
కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అనుమతి ఉన్నవాటిని కూడా ప్రమాదకరంగా ఉంటే తీసేయండి
ప్రాణనష్టం జరగకుండా చేపట్టే చర్యల వివరాలు సమర్పించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పుట్టినరోజున తండ్రి చితికి నిప్పుపెట్టాల్సి వచ్చిన బాలుడిని ఎవరు ఓదారుస్తారు?
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులను నిలదీసిన జస్టిస్ నగేశ్ భీమపాక
అనుమతిలేని కేబుళ్ల తొలగింపునకు సిద్ధమైన ఎస్పీడీసీఎల్
కేబుళ్ల తొలగింపుతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మరణాలకు బాధ్యత తమది కాదంటే తమది కాదంటూ అంతా ఇతరులపై నెపం నెట్టేస్తున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. తొమ్మిదేళ్ల బాలుడు తన పుట్టినరోజునే తండ్రి చితికి నిప్పుపెట్టాల్సిన దుస్థితి వచ్చిందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఆ బాలుడిని ఎవరు ఓదారుస్తారని ప్రశ్నించింది. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనాన్ని ఓపెన్ కోర్టులో ధర్మాసనం ప్రస్తావించింది. ఎటువంటి ఒప్పందాలు, అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుళ్లన్నీ తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు ఉన్నా ప్రమాదకరంగా ఉంటే తొలగించాలని స్పష్టం చేసింది. అక్రమ కేబుళ్లను తొలగించడం, ప్రాణనష్టం లేకుండా ఏయే చర్యలు తీసుకున్నారనేదానిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్‌కు ఆదేశాలు జారీచేసింది. రామంతాపూర్ విద్యుదాఘాతం ఘటన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఒప్పందం మేరకు స్తంభాలకు కేబుళ్లు పెట్టామని, నోటీసు ఇవ్వకుండా తొలగించడం అక్రమమని ఎయిర్‌టెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో 20లక్షలకుపైగా స్తంభాలు ఉంటే.. 1.73 లక్షల స్తంభాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్ న్యాయవాదులు తెలిపారు. పరిమితికి మించి కేబుళ్లు ఉండటంతో స్తంభాలు పడిపోతున్నాయని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్రమంగా కేబుళ్లు పెడితే ప్రభుత్వ, విద్యుత్‌శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుటుంబాలను ఎవరు ఓదారుస్తారని, ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటని నిలదీసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇకపై నిరంతర ప్రక్రియగా కేబుళ్ల తొలగింపు..
విద్యుత్ స్తంభాలపై వేసిన అనుమతి లేని కేబుళ్లనింటినీ తొలగించాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. చాలా ఇంటర్నెట్, కేబుల్ టీవీ కంపెనీల నిర్వాహకులు అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలపై ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎ్‌ఫసీ), కో-యాక్సిల్ కేబుల్ (లోపల లోహపు కండక్టర్‌తో ఇన్సులేషన్ ఉన్న కేబుల్ టీవీ తీగలు)ను అమర్చుతున్నారని గుర్తించింది. ఈ కేబుళ్లు వదులుగా కిందకు వేలాడుతుండటం, ఉపయోగించని, పనికిరాని కేబుళ్లను అలాగే వదిలేయడం, స్తంభాల వద్ద పరికరాలను ఏర్పాటు చేయడం వంటివి ప్రమాదకరంగా మారుతున్నట్టు తేల్చింది. ఈ క్రమంలోనే అనుమతి తీసుకోకుండా వేసిన కేబుళ్లను తొలగించాలని.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. కేబుళ్లు వేసేందుకు అనుమతి పొందిన సంస్థలు సంబంధిత నిబంధనలన్నీ కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఆపరేటర్లంతా సంప్రదించుకుని అనధికారంగా వేసిన కేబుళ్లను తొలగించాలని కోరినా ఫలితం లేకపోవడంతో.. ప్రజా భద్రత దృష్ట్యా తాము చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది.
ఉన్నట్టుండి కేబుళ్లు కట్ చేస్తే ఎలా?
గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కేబుళ్ల తొలగింపుతో ఇంటర్నెట్, కేబుల్ టీవీ సేవలు నిలిచిపోయాయి. దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని వినియోగదారులు, ఇంటర్నెట్ సర్వీసుల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి తీసుకోకుండా కేబుళ్లు వేయడాన్ని ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నట్టుండి తొలగిస్తే ఎలాగని నిలదీస్తున్నారు. ముందస్తుగా సమాచారమిచ్చి, కేబుళ్లను సరిచేసే అవకాశమిచ్చి.. అప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు రామంతాపూర్ ఘటనలో సమస్య ఎక్కుడుందో, ఎలా ప్రమాదం జరిగిందో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయలేదని, ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News