Share News

Kaleshwaram Project: మీది అనవసర ఆందోళన

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:56 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌ వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

Kaleshwaram Project: మీది అనవసర ఆందోళన

  • అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలని ప్రభుత్వం చెబుతోంది

  • విచారణ సంఘం నివేదికను సభలో పెట్టి చర్చించవచ్చని చట్టంలో ఉంది

  • ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు

  • బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ

  • నివేదికను నెట్‌లో పెట్టి ఉంటే తొలగించాలని సర్కారుకు ఆదేశం

  • కౌంటర్‌ దాఖలుకు 5 వారాల గడువు.. తదుపరి విచారణ 7వ తేదీకి..

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌ వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పిటిషనర్లు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. నివేదికను శాసనసభలో పెట్టి.. చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంటోందని.. ఈ మేరకు క్యాబినెట్‌ తీర్మానాన్ని సైతం అందజేశారని పేర్కొంది. ఎంక్వైరీ కమిషన్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టి చర్చలు జరపవచ్చని చట్టంలోనే ఉందనే విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. కమిషన్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఇప్పటికప్పుడు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెప్తున్నందున.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ అసవరం లేదని పేర్కొంది. అదే సమయంలో.. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ సారాంశాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. తాము వెబ్‌సైట్‌లో పెట్టలేదని ఏజీ సుదర్శన్‌రెడ్డి చెప్పగా.. ఒకవేళ వెబ్‌సైట్‌లో పెట్టి ఉంటే దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ల ఆరోపణలపై పూర్తిస్థాయి కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం, ప్రభుత్వ కౌంటర్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లకు వారంపాటు గడువు ఇచ్చింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్‌, హరీశ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. కమిషన్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా? పెట్టక ముందే చర్యలు తీసుకుంటారా? అని గురువారం హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వాదనలు ప్రారంభమైన వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన లిఖితపూర్వక సూచనలను, రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాన్ని ధర్మాసనానికి అందజేశారు. అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. కేసీఆర్‌, హరీశ్‌ ఇద్దరూ సభలో సభ్యులే కాబట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చని తెలిపారు. అలాగే సదరు రిపోర్ట్‌ సారాంశాన్ని వెబ్‌సైట్లో పెట్టారని పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలు తప్పని.. తాము ఏ వెబ్‌సైట్‌లోనూ పెట్టలేదని.. ఆ మేరకు కావాలంటే ప్రమాణపత్రం దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషనర్లకు ఇచ్చింది సెక్షన్‌ 8-బీ నోటీసులే అని.. కమిషన్‌ 8-బీ ప్రొసీజర్‌ను అనుసరించిందని తెలిపారు. ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాజీవితంలో ఉన్న వారికి ఓపెన్‌ మైండ్‌ ఉండాలని.. ఇక్కడ ప్రతిష్ఠకు భంగం కలగడం అంటూ ఏదీ ఉండదని పేర్కొన్నారు. కమిషన్‌ రిపోర్ట్‌ అడ్వైజరీ లక్షణం మాత్రమే కలిగి ఉంటుందని తెలిపారు.


యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ లేకుండా ఏంచేస్తారు?

కేసీఆర్‌, హరీశ్‌రావు తరఫు సీనియర్‌ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌లోని 8-బీ, 8-సీ ప్రకారం.. నోటీసులు ఇవ్వకుండా తమకు వ్యతిరేకంగా రిపోర్ట్‌ ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. సదరు రిపోర్ట్‌లోని ఫైండింగ్స్‌ తమ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. దాన్ని అసెంబ్లీలో పెట్టకముందే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టడంతోపాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడం చేయని తప్పునకు నిందించడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. కమిషన్‌ రిపోర్టును అసెంబ్లీలో పెట్టడానికి చట్టప్రకారం ఆరునెలల సమయం ఉందని.. రిపోర్ట్‌పై ఏం చర్య తీసుకున్నారనేది లేకుండా కేవలం దాన్ని అసెంబ్లీలో పెట్టి ఏంలాభమని.. దానితోపాటు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ కూడా ఉండాలని వాదించారు. అసెంబ్లీలో పెట్టడం కూడా తదుపరి చర్య కిందకే వస్తుందని.. ఆ చర్యను అడ్డుకుంటూ స్టే ఇవ్వాలని కోరారు. తమ వాదన వినకుండా, క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన కమిషన్‌ రిపోర్ట్‌ అక్రమమని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ప్రతిష్ఠ చాలా ముఖ్యమని.. అది పోతే భవిష్యత్తు ఉండదని.. కమిషన్‌ రిపోర్ట్‌ను మీడియాకు ఇవ్వడం ద్వారా ఇప్పటికే తమకు తీరని నష్టం జరిగిందని.. అసెంబ్లీలో రిపోర్ట్‌ పెట్టి రాజకీయ విమర్శలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణం కమిషన్‌ రిపోర్ట్‌పై స్టే ఇవ్వాలని కోరారు. అన్నివర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కమిషన్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టే వరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోదు కాబట్టి ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ అసవరం లేదని పేర్కొంది. పిటిషనర్లు, ప్రభుత్వం ఉత్తరప్రత్యుత్తరాలను ఐదువారాల్లో పూర్తిచేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

అందుకే యూరియా ఆలస్యమైంది

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 04:56 AM