Share News

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:54 AM

కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

  • కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగారు

  • రేవంత్‌ రైతులతో అధికారుల కాళ్లు మొక్కిస్తున్నాడు

  • ఆయనకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ యూరియాపై లేదు

  • కాంగ్రెస్‌ మంత్రులను గ్రామాల్లో తిరగనివ్వం: హరీశ్‌

సిద్దిపేట/హైదరాబాద్‌ ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. యూరియా బస్తాకోసం రైతులు అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రావడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌కు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, యూరియా మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన హరీశ్‌రావు చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయకసాగర్‌ను సందర్శించారు. అంతకుముందు నంగునూర్‌ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. యూరియా ఇవ్వని కాంగ్రెస్‌ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదని, కాంగ్రెస్‌ మంత్రులను ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.


సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగిస్తున్నారని, యూరియా సరఫరాపై ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా అందించాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వడ్లు అమ్మి మూడు నెలలైనా రైతులకు రూ.1,300 కోట్లు బోనస్‌ డబ్బులు చెల్లించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని రేవంత్‌రెడ్డి గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని, రంగనాయకసాగర్‌ ఉన్న నీళ్లు కాళేశ్వరం జలాలు కావా అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని, మోటార్లను ఆన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:54 AM