Harish Rao KCR: ఇప్పుడేం చేద్దాం?
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:07 AM
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మరోసారి సమావేశమయ్యారు.
కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రభావం, ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ!
ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశంపైనా..
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌ్‌సలో కేసీఆర్‌ను బుధవారం కలిసిన హరీశ్‌రావు ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను వివరిస్తూ.. హరీశ్‌రావు ఇటీవల ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్లింది అనే అంశంపై ఇరువురు చర్చించుకున్నారని సమాచారం. అలాగే, కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ప్రజల్లో బలంగా తిప్పి కొట్టేందుకు ఏం చేయాలనే విషయంలో కేసీఆర్ ఈ సందర్భంగా హరీశ్‌కు పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
అలాగే, కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి ఏం చేయనుంది? ప్రభుత్వ చర్యను అధిగమించేందుకు ఎలా స్పందించాలి ? అనే అంశాలపై కూడా కేసీఆర్‌తో హరీశ్ సమాలోచన చేసినట్టు సమాచారం. అయితే, కమిషన్ నివేదిక అంశంలో భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం న్యాయనిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన ధర్నా అంశాన్ని హరీశ్‌తో భేటీ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. కాంగ్రెస్ ధర్నా ప్రభావం ప్రజల్లో ఎంత మేరకు ఉంది, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, బీసీల అంశంలో బీఆర్‌ఎస్ ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయాలపై కూడా కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు