Harish Rao: లోకల్ కోటా రద్దుతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:37 AM
మెడికల్ పీజీ సీట్లలో 50 శాతం ‘లోకల్ రిజర్వేషన్’ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు స్పందించాలి: హరీశ్
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మెడికల్ పీజీ సీట్లలో 50 శాతం ‘లోకల్ రిజర్వేషన్’ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణలోని 2,924 పీజీ సీట్లలో 50శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1,462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వచ్చేవని, సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సీట్లు కూడా ఆలిండియా కోటాలోకి వెళ్లిపోతాయని పేర్కొన్నారు.
తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారన్నారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించమని కోరాలని, తీర్పుపై స్టే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ విషయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలన్నారు.