Harish Rao: తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే.. అందుకే కాళేశ్వరం చేపట్టాం
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:24 AM
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
నాడు కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా అనుమతివ్వలే
ప్రాణహిత -చేవెళ్లలో ఒక లింక్ మాత్రమే మార్చాం.. ఆరు లింకులు యథాతఽథం
బ్యారేజీల నీటి నిల్వ నిర్ణయం అధికారులదే..
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ సమయంలోనూ నిర్మాణ స్థలాలు మార్చారు
కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆ ప్రాజెక్టును ఏడు లింకులుగా ప్రతిపాదించగా.. ఆరు లింకులను కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒకదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు. సోమవారం ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లో చిక్కుముళ్లు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇందుకోసం తాను చైర్మన్‌గా, నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే ప్రాణహిత-చేవెళ్లను రీ ఇంజనీరింగ్ చేశామన్నారు. ప్రాణహిత -చేవెళ్లను రెండు ప్రాజెక్టులుగా విడగొట్టామని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో నీరందించడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహితగా, మరొకటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేపట్టామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లలో ఏడు లింక్‌లు ఉండగా.. అందులో ఒక్క లింక్ తప్ప మిగిలిన లింకులన్నీ యథాథతంగా చేపట్టామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని మార్చామని చెప్పారు. 152 అడుగుల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అంగీకరించలేదని హరీశ్‌రావు తెలిపారు.
ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అప్పటి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీ్‌ఫను 2014 ఆగస్టు 23న కలిశానని తెలిపారు. 152 అడుగుల ఎత్తుతో బ్యారేజీని అంగీకరించబోమని మహారాష్ట్ర నాటి సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ కూడా రాశారన్నారు. 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా.. అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేవేంద్ర ఫడణవీ్‌సతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని చెప్పారు. ‘నేనే ప్రాణహిత-చే వెళ్ల ముంపునకు వ్యతిరేకంగా ఉద్యమించా. అలాంటి నేనే అనుమతులు ఎలా ఇస్తా?’ అని ఫడణవీస్ పేర్కొన్నారని తెలిపారు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని సీడబ్ల్యూసీ 2015 మార్చి 4న లేఖ రాసిందన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేఖతో రీ ఇంజనీరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించగా..ఉందని, ప్రతి కాంపొనెంట్‌కు మంత్రివర్గ తీర్మానం కూడా ఉందని హరీశ్‌రావు జవాబు ఇచ్చారు. బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం హైపవర్ కమిటీ తీసుకుందా? వ్యాప్కోస్ లేఖ తర్వాత హై పవర్ కమిటీతో సమావేశం జరిగిందా? అని కమిషన్ ప్రశ్నించగా.. హైపవర్ కమిటీ పూర్తిగా సాంకేతిక కమిటీ అని, బ్యారేజీల స్థలాల మార్పుపై ఆ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తాము ప్రజాప్రతినిధులమని, సాంకేతిక అంశాలపై తమకు సంపూర్ణ అవగాహన ఉండదని బదులిచ్చారు. ప్రాజెక్టులు ప్రతిపాదించిన తర్వాత కూడా నిర్మాణ స్థలాలను మార్చారని, నాగార్జునసాగర్‌ను తొలుత ఏలేశ్వరం వద్ద కట్టాలని ప్రతిపాదించారని, ఆ తర్వాత నందికొండకు మార్చారని, అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తొలుత కుస్తాపురం వద్ద ప్రతిపాదించగా.. ఆ తర్వాత పోచంపాడుకు మార్చారని, రిజర్వాయర్లు ప్రతిపాదించిన తర్వాత మార్చిన దాఖలాలు పలు ప్రాజెక్టుల్లో ఉన్నాయని హరీశ్ గుర్తుచేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌ను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి సరిపడా నిధుల్లేవని, నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వ రుణ సంస్థలతో పాటు జాతీయ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నామని చెప్పారు. కాళే శ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలను కార్పొరేషన్ నుంచే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు, ప్రాజెక్టు వెంట గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీటికి నిధులు వసూలు చేసి, వాటితో రుణాలను తిరిగి చెల్లించాలని అనుకున్నట్లు హరీశ్ తెలిపారు. రెండేళ్లపాటు కరోనా కారణంగా సాధ్యం కాలేదన్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల అప్పగింతలో జాప్యం జరిగిందా? అని ప్రశ్నించగా.. పెద్దగా జరగలేదన్నారు. నిపుణుల కమిటీ సిఫారసులు అమలు చేశారా? అని అడగ్గా.. మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని కమిటీ సూచించిందని హరీశ్ తెలిపారు. అయితే మార్గమధ్యంలో ఎన్‌టీపీసీతో పాటు సింగరేణి గనులు ఉండడంతో సాధ్యం కాదనే అమలు చేయలేదన్నారు. ఏ మేరకు నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కట్టారని ప్రశ్నించగా.. కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. బ్యారేజీల నీటి నిల్వకు ఆదేశాలు ఎవరిచ్చారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ నిర్ణయం సాంకేతిక అధికారులదేనని హరీశ్ బదులిచ్చారు. బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించలేదని, ఆ నిర్ణయం అధికారులే తీసుకున్నారని గుర్తుచేశారు.
భారీగా తరలివచ్చిన శ్రేణులు
హరీశ్‌కు మద్దతుగా అభిమానులు/కార్యకర్తలు తరలివచ్చారు. వీరంతా ర్యాలీగా కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్‌కే భవన్‌కు తరలిరాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కమిషన్‌కు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా హరీశ్‌కు మద్దతుగా నినాదాలు ఇవ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నీళ్లు లేని చోట కాంగ్రెస్ బ్యారేజీని ప్రతిపాదించింది
నీళ్లు లేని తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ పార్టీ బ్యారేజీని ప్రతిపాదించిందని హరీశ్‌ఆరోపించారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నెలరోజులకే తుమ్మిడిహెట్టి బ్యారేజీ పనుల కోసం మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపామన్నారు. సీడబ్ల్యూసీ మూడు లేఖలు రాసిందని, వ్యాప్కోస్ అల్లాటప్పా సంస్థ కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేని చోట బ్యారేజీని ప్రతిపాదించగా.. తాము అధికారంలోకి వచ్చాక నీళ్లున్న చోటుకుబ్యారేజీని మార్చామన్నారు. గంధమళ్ల దగ్గరికి సీఎం రేవంత్ వెళ్లారని, ఆ రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ నుంచే నీళ్లు వస్తాయని హరీశ్ గుర్తుచేశారు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించడానికి ప్రతిపాదించిన పథకానికి నీళ్లు కూడా మల్లన్నసాగర్ నుంచే వస్తాయన్నారు.
ఆంగ్లం రాదని.. ఆంగ్లంలోనే జవాబులు!
కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కాగానే.. ‘నేను తెలుగు మీడియం విద్యార్థిని’ అని తెలుగులోనే ప్రశ్నలకు జవాబు చెబుతానని హరీశ్ అన్నారు. అయితే కమిషన్ అడిగిన ప్రశ్నలకు 95 శాతానికి పైగా ఆంగ్లంలోనే జవాబులు చెప్పారు. అంతేగాక సమగ్రంగా వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం 11:39 గంటలకు కమిషన్ విచారణ ప్రారంభమవగా.. 114వ క్రాస్ విట్‌నెస్ (సాక్షి)గా హరీశ్ హాజరయ్యారు. తాను తెలుగు మీడియం విద్యార్థినని హరీశ్ కమిషన్‌కు నివేదించగా.. తనకు తెలుగు రాకపోయినా తెలుగులో జవాబులు చెప్పడానికి అవకాశం ఇస్తున్నామని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు. దాంతో కమిషన్ ఆంగ్లంలో దాదాపు 21 ప్రశ్నలు వేయగా.. అన్నింటికీ హరీశ్ ఇంగ్లిష్‌లోనే జవాబులు ఇచ్చారు. తాను జీవితకాలంలో ఏ రోజూ కమిషన్‌ల విచారణకు హాజరవలేదని, తొలిసారి హాజరవుతున్నానని హరీశ్ విలేకర్లతో చెప్పారు.