Share News

Harish Rao: హోంగార్డులకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:02 AM

ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామంటూ.. ప్రచారం చేసుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకు కూడా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: హోంగార్డులకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు

  • సీఎం రేవంత్‌ ఏం జవాబు చెబుతారు?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామంటూ.. ప్రచారం చేసుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకు కూడా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో 16 వేలమందికిపైగా ఉన్న హోంగార్డులు.. తమకు వచ్చే చిన్న జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, చేతిలో చిల్లిగవ్వ లేక వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన తెలిపారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజాపాలన కాదు, ప్రజావ్యతిరేక పాలన అని పేర్కొన్నారు.


హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల విషయంలో ‘చోటీ సోచ్‌’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని హరీశ్‌ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తే.. అవమానకరంగా మాట్లాడటం కేంద్ర మంత్రి స్థాయికి తగదని అన్నారు. గ్రోత్‌ ఇంజన్‌గా ఉన్న తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధే దేశాభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలని హరీశ్‌రావు సూచించారు.

Updated Date - Feb 13 , 2025 | 04:02 AM