Share News

Harish Rao: ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరూ కట్టొద్దు

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:29 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులెవరూ రుసుములు చెల్లించవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు..

Harish Rao: ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరూ కట్టొద్దు

  • అధికారంలోకొస్తే ఉచితంగా క్రమబద్ధీకరణ

  • అన్నారు.. ఇప్పుడేమో ఫీజుల వసూళ్లు

  • చిన్నారెడ్డి వ్యాఖ్యపై ఈడీ, ఐటీ స్పందించదేం?

  • కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థుల్లో మంచి వ్యక్తికే ఓటేయండి

  • 27న ఎస్‌ఎల్‌బీసీ వద్దకు బీఆర్‌ఎస్‌ బృందం

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులెవరూ రుసుములు చెల్లించవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు 25 శాతం రాయితీ అంటూ రుసుములు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. చారణా రిబేట్‌ ఇచ్చిన కాంగ్రె్‌సకు.. రేపు ఎన్నికల్లో ఓటర్లు బారణా రిబేట్‌ ఇస్తారని చెప్పారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5-10 లక్షల వరకు ఇచ్చారని ఆ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డి బట్టబయలు చేశారని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. చిన్నారెడ్డి వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయని హరీశ్‌ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పోలీసు రాజ్యమైందని, తమ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని ఆరోపించారు.


ఫోన్లు చేసి వెంట పడుతున్నారు..

బీఆర్‌ఎస్‌ హయాంలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తులు ఆహ్వానిస్తే.. పేద ప్రజల రక్తం తాగే పథకం అంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, సీతక్క, కోదండరాం నానా యాగీ చేశారని హరీశ్‌ గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడేమో ఫీజులు పెంచి, అధికారులు దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి మరీ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము కట్టాలని వెంటపడుతున్నారన్నారు. ఉచితంగా చేస్తామన్నారని.. దానిపై కోదండరాం ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు అంతా ఉచితం అన్నారని.. ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌ అని జేబులు ఖాళీ చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు కట్టవద్దని దరఖాస్తుదారులకు పిలుపునిచ్చారు.


27న బీఆర్‌ఎస్‌ బృందం ఎస్‌ఎల్‌బీసీకి..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిన ఘటన చాలా బాధకరమని హరీశ్‌ అన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క కిలోమీటరు కూడా తవ్వలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని తాము 11.48 కి.మీ. తవ్వామని చెప్పారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగితే నానా యాగీ చేశారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఖమ్మంలో పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిందని, వట్టెం పంప్‌హౌస్‌ నీట మునిగిందని, ఎస్‌ఎల్‌బీసీ కూలిందని తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే బీఆర్‌ఎస్‌ బృందం ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లలేదన్నారు. 27న నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళతామని హరీశ్‌ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థుల్లో మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Updated Date - Feb 26 , 2025 | 04:29 AM