GST Reform: రాష్ట్ర ఖజానాకు 10 వేల కోట్ల నష్టం!
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:03 AM
కేంద్రం ‘వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)’లో తెచ్చిన సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. వివిధ రకాల సరుకులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించడం, ఎత్తివేయడం వల్ల రాబడి గణనీయంగా తగ్గనుంది.
ప్రధాన రంగాల్లో తగ్గనున్న జీఎస్టీ రాబడి.. సిమెంటు, ఆటోమొబైల్‌పై 10ు పన్ను తగ్గుదల
గ్రానైట్‌పై తగ్గనున్న 7% ఆదాయం
పరిహారం చెల్లించాలని సర్కారు డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ‘వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)’లో తెచ్చిన సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. వివిధ రకాల సరుకులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించడం, ఎత్తివేయడం వల్ల రాబడి గణనీయంగా తగ్గనుంది. పన్ను రేట్ల సవరింపుతో రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల మేర రాబడి తగ్గుతుందని బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క తెలంగాణకే రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కానీ, ఈ నష్టం రూ.10 వేల కోట్లకు పైగా ఉంటుందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ విక్రయాలు జరిగే సిమెంటు, ఆటోమొబైల్, ఔషధాలు, ఎలకా్ట్రనిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. జీవిత, ఆరోగ్య బీమా సేవలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. చాలా రకాల నిత్యావసరాలపై పన్నును తొలగించింది. నిజానికి ఇవి రాష్ట్రానికి అత్యధిక రాబడిని సమకూరుస్తున్నాయి. వీటిపై విధించే జీఎస్టీ సొమ్ములో సగం కేంద్రానికి, సగం రాష్ట్రానికి దక్కుతుంది. ఉదాహరణకు సిమెంటుపై రాష్ట్ర రాబడి దారుణంగా తగ్గే అవకాశాలున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద రాబడి మార్గం. భవన నిర్మాణ రంగంలో నెలకు 1.5-2 మిలియన్ టన్నులకు పైగా సిమెంటును వినియోగిస్తున్నట్లు అంచనా. బ్రాండును బట్టి ఒక్కో సిమెంటు బ్యాగు ధర రూ.350కి పైగా పలుకుతోంది. ఈ సిమెంటు విక్రయాలపై ప్రభుత్వం ఇదివరకు 28 శాతం జీఎస్టీని విధించేది. ఇప్పుడు దాన్ని 18 శాతం శ్లాబులో చేర్చింది. అంటే మొత్తం సిమెంటు విక్రయాలపై 10 శాతం మేర పన్ను రాబడి తగ్గిపోనుంది.
రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ కూడా పెద్దదే. గ్రానైట్‌పై 12 శాతం ఉన్న జీఎస్టీ 5 శాతానికి తగ్గనుంది. దీని ద్వారా వచ్చే రాబడిలో 7 శాతం మేర తగ్గనుంది. వ్యక్తిగత, జీవిత బీమాలపై ఇదివరకున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 18 శాతం రాబడి పూర్తిగా పోనుంది.
ఆటోమొబైల్ రంగం రాష్ట్ర ప్రభత్వ ఆదాయానికి గణనీయంగా ఊతమిస్తోంది. ఈ రంగంలోని కార్లు, త్రిచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో రాబడికి గండి పడనుంది. రాష్ట్రంలో ఏటా వివిధ రకాల వాహనాలు దాదాపు 10 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయి. వీటిపై 10ు మేర జీఎస్టీ తగ్గనుండడంతో రాబడిపై ప్రభావం చూపనుంది.
రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్ ఉపకరణాల మార్కెట్ కూడా పెద్దదే. ముఖ్యంగా ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు బాగా అమ్ముడవుతుంటాయి. వీటిపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నారు. ఇక్కడా 10 శాతం మేర రాబడి తగ్గుతుంది.
నిత్యావసర వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్ కూడా రాష్ట్రానికి పెద్ద రాబడి మార్గం. ఈ విభాగంలోని చాలా వస్తువులను 5ు శ్లాబులో చేర్చారు. కొన్నింటిపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేశారు. ఇలా అన్ని రకాలుగా రాష్ట్ర రాబడి రూ.10 వేల కోట్లకు పైగా తగ్గుతుందని చెబుతున్నారు
పరిహారం ఇవ్వండి..
పన్ను శ్లాబుల సవరింపుతో కోల్పోతున్న రాబడిని పూడ్చడానికి పరిహారం చెల్లించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తప్పకుండా పరిహారం చెల్లించాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి.. జీఎస్టీ మండలికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ)లో జీఎస్టీ వాటా 2022-23లో 3.07 శాతం ఉండగా.. 2024-25లో అది 2.58 శాతానికి పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో ఇది మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా నష్టపోయే రాబడిని పరిహారం రూపంలో పూడ్చాలని డిమాండ్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News