GHMC Delimitation Issue: GHMC వార్డుల డీలిమిటేషన్ గొడవ.. బల్దియాకు క్యూ కట్టిన నేతలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:16 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో వార్డుల పునర్విభజన విషయంపై అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బల్దియా ప్రధాన కార్యాలయానికి నేతలు, నగరవాసులు క్యూ కడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC)లో వార్డుల డీలిమిటేషన్ పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి భారీ ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డులు పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అయితే.. డీలిమిటేషన్ ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని, జనాభా ప్రమాణాలు, భౌగోలిక సౌలభ్యం,కమ్యూనిటీ సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని దీని వల్ల కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
వార్డుల విభజన ఇష్టానుసారంగా చేశారని బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రేపటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. వార్డుల విభజనపై అధికారులను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పోరేటర్లు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. GHMC అధికారులు ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే
ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్