National Sports Day: సైక్లింగ్‌ను విస్తృతం చేయాలి: గవర్నర్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:56 AM
జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీ ప్రారంభించారు.
‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవడానికి ఉపయోగకరమైన సైక్లింగ్‌ను తెలంగాణలో మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ‘ఫిట్నెస్ కా డోస్.. ఆదాగంట రోజ్ ’ అన్న నినాదాన్ని విద్యార్థుల్లో, యువతలో, ఉద్యోగుల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణలో 9 రోజుల పాటు జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, పోలీసు క్రీడల విభాగం ఐజీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్పోర్ట్స్ పల్స్ (క్రీడానాడి) బులెటిన్‌ను గవర్నర్ ఆవిష్కరించారు.
చట్టసభల్లోనూ బీసీ రిజర్వేషన్లు సాధించాలి
బీసీ యుద్ధ భేరి సభలో వక్తలు
బర్కత్‌పుర, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42ు రిజర్వేషన్ల స్పూర్తిగా చట్టసభల్లోనూ బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. రాజ్యాధికారం సాధించుకుంటేనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్ అధ్యక్షతన కోల జనార్థన్ సమన్వయ కర్తగా బీసీల యుద్ధభేరి మహాసభ జరిగింది. హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల కోసం కేంద్రం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42ు బీసీ రిజర్వేషన్ల కల్పనకు సర్కారు జీవో జారీ చేయడం అభినందనీయమని, దానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన వారిని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, బీసీ సంఘాల నేతలు నీలావెంకటేష్, వేముల రామకృష్ణ, వి.దానకర్ణాచారి, సుధాకర్ ముదిరాజ్, కృష్ణాయాదవ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..