LRS Scheme: ‘ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ’పై సదస్సులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:59 AM
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తుదారులకు రాయితీ ఇచ్చినా పెద్దగా స్పందన లేకపోవటంతో.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ఈ పథకం గురించి ప్రచారం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజల్లో అవగాహన పెంచాలి
కలెక్టర్లు, కమిషనర్ల్లు అంతా పాల్గొనాలి
రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, ఏజెంట్లు, దరఖాస్తుదారులు పాల్గొనేలా ప్రోత్సహించాలి.. ప్రభుత్వం ఆదేశాలు
రేపు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తుదారులకు రాయితీ ఇచ్చినా పెద్దగా స్పందన లేకపోవటంతో.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ఈ పథకం గురించి ప్రచారం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా, శుక్రవారం పొద్దుపోయేవరకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెలాఖరు వరకూ ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పథకం అమల్లో ఉంటుంది. శనివారం నాటి కి 8 రోజుల వ్యవధిలో దాదాపు 8 వేల దరఖాస్తులను ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇప్పటికే 25.68 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో ఆటోమేటిక్ ఫీజు జనరేట్ అయినవి 19 లక్షల వరకు ఉన్నాయి.. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు కనిపిస్తున్నా.. 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తుదారులు ముం దుకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే, దరఖాస్తుదారు లు రాయితీ పథకాన్ని వినియోగించుకునేలా ప్రొత్సహించేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సుల్లో కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొనాలని.. రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, ఏజెంట్లు, లేఅవుట్లు వేసిన యజమానులు.. దరఖాస్తుదారులను సదస్సులకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశించింది.
స్పందనలేమికి కారణాలేమిటి?
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడంపై అధికారుల నుంచి పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో భూముల ధరలు ఆశాజనకంగా లేవని, మార్కెట్ కాస్త మందకొడిగా ఉందని చెబుతున్నారు. ఇటు భూసంబంధిత వివాదాల మీద నడుస్తున్న కోర్టు కేసులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో.. ఎవరైనా కేసులు వేసి స్టే తీసుకొస్తే, పెట్టిన డబ్బులు వృథా అవుతాయని కొనుగోలుదారు లు భావిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ కింద ఆటోమేటిక్ ఫీజు జనరేట్ అయిన దరఖాస్తుల్లో రూ.4 లక్షలు, అంతకన్నా ఎక్కువ ఫీజు కట్టాల్సిన వాళ్లు.. అంత మొత్తం కట్టలేక వెనకడుగు వేస్తున్నారా అనే కోణంలో కూడా అధికారులు చర్చించుకుంటున్నారు.