Medical Admission: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు లైన్ క్లియర్
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:03 AM
వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికత ఉత్తర్వుపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది..
జీవో 33కుసవరణలు చేసిన రాష్ట్ర సర్కారు
నాలుగు కేటగిరీలకు స్థానికత నుంచి మినహాయింపు
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 15 నుంచి కౌన్సెలింగ్
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికత ఉత్తర్వుపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవో నంబరు 33ను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ బదిలీల్లో భాగంగా తెలంగాణ వెలుపల నివసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఆల్ ఇండి యా సర్వీసులు (రాష్ట్ర క్యాడర్‌కు చెంది ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐఎ్‌ఫఎస్, ఐపీఎస్) క్యాడర్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఆర్మీ, పోలీస్ సిబ్బంది పిల్లలు, కార్పొరేషన్, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్థానికతపై మినహాయింపునిచ్చారు. ఈ 4 కేటగిరీలకు చెందిన విద్యార్థులు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదువకున్నా...వారి తల్లిదండ్రులు ఇక్కడి వారేనని, బదిలీల కాలంలో పిల్లలు రాష్ట్రం వెలుపల చదివారనే అంశాన్ని సంబంధిత ఉద్యోగ ధ్రుపపత్రంలో రుజువు పత్రాలు సమర్పిస్తే స్థానికులుగానే పరిగణించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆ 4 కేటగిరీలకు చెందిన విద్యార్థులు మంగళవారం నుంచి ఈ నెల 11 వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీలో అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా వెల్లడిస్తామని వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి తెలిపారు. కాగా, జీవో నంబర్ 33కు సవరణ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఎంబీబీఎస్, బీడీఎ్‌సలలో కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను హెల్త్ వర్సిటీ ప్రారంభించనుంది. మొత్తం 4 విడతల కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 4,090 యూజీ సీట్లున్నాయి. ఇందులో అఖిల భారత కోటా కింద 613 సీట్లు వెళ్లాయి. మిగిలిన సీట్లకు హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News