Share News

LRS: రిజిస్ట్రేషన్‌ శాఖతో ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ అనుసంధానం

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:45 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే 25 శాతం రాయితీ, కనీసం 10శాతం రిజిస్ట్రేషన్లతో మిగిలిన ప్లాట్లు కలిగిన లే అవుట్లకు రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

LRS: రిజిస్ట్రేషన్‌ శాఖతో ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ అనుసంధానం

  • నేటి నుంచి ఫీజుల చెల్లింపు అందుబాటులోకి సాఫ్ట్‌వేర్‌

  • డీడీలకు నో.. ఆన్‌లైన్‌, యూపీఐలకు ఓకే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే 25 శాతం రాయితీ, కనీసం 10శాతం రిజిస్ట్రేషన్లతో మిగిలిన ప్లాట్లు కలిగిన లే అవుట్లకు రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధీనంలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానం చేశారు. సోమవారం సాయంత్రం నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు అందుబాటులోకి వస్తాయని డీటీసీపీ దేవేందర్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. లేఅవుట్లు, అమ్ముడవ్వని ప్లాట్ల వివరాలు అన్ని రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానించారు. మంగళవారం నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు చెల్లించాల్సిన ఫీజును డీడీ తప్ప మిగిలిన అన్ని మార్గాల ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉందని డీటీసీపీ తెలిపారు. డీడీలు తీస్తే ఒకే డీడీని పది దరఖాస్తులకు జత చేసే అకాశం ఉంటుందని, ఆ పొరపాట్లకు తావు లేకుండా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, ఇతర యూపీఐ పేమెంట్‌ యాప్‌ల ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పించారు.. కాగా 2020లో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల నుంచి దాదాపు 25.68 లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఫీజు పరిధిలోకి ఎన్ని వస్తాయనేదానిపై లెక్కలు తీస్తున్నామని డీటీసీ దేవేందర్‌ రెడ్డి తెలిపారు.


ఆ సర్వే నంబర్ల వివరాలు పంపండి

లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల్లో సడలింపులపై మరింత స్పష్టతనిస్తూ పురపాలక శాఖ రెండో మెమో జారీ చేసింది. మునిసిపల్‌ కమిషనర్లు, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీల వీసీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, డీటీసీపీవోలు తమ పరిధిలో ఉండే నీటి వనరులు, సరస్సులకు 200 మీటర్ల పరిధిలో ఉండే భూముల సర్వే నంబర్లు, ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ల వివరాలను జీసీసీకి పంపాలని ఆదేశించింది. ఈ రెండు కేటగిరీల్లో లేని దరఖాస్తులను పంచాయతీ రాజ్‌, పురపాలక శాఖ అధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఆయా భూములకు ఆటోమేటిక్‌గ్గా ఫీజు జనరేట్‌ అవుతుందని, వారికి మార్చి 31 వరకు 25 శాతం ఫీజు రాయితీ వర్తిస్తుందని తెలిపింది.

Updated Date - Feb 25 , 2025 | 03:45 AM