ఆర్‌ఆర్‌ఆర్ పరిహారంపై కసరత్తు
ABN , Publish Date - Jan 03 , 2025 | 02:58 AM
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం రహదారి నిర్మాణంలో భూ పరిహారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ధరలను పెంచి అందించేందుకు ఆర్బిట్రేషన్ విధానాన్ని అవలంభించాలని ప్రాధమికంగా నిర్ణయించింది.
గరిష్ఠ స్థాయిలో అందించడంపై నజర్
త్వరలో ధరలను ఖరారు చేయాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి2(ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం రహదారి నిర్మాణంలో భూ పరిహారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ధరలను పెంచి అందించేందుకు ఆర్బిట్రేషన్ విధానాన్ని అవలంభించాలని ప్రాధమికంగా నిర్ణయించింది. ఆర్బిట్రేషన్ అంటే రోడ్డు నిర్మాణమయ్యే జిల్లాల పరిధిలోని కలెక్టర్లు అక్కడి భూములకు పరిహారం పెంచే విషయంలో ఒక నిర్ణయం తీసుకుని, అదే విషయాన్ని ప్రభుత్వానికి, జాతీయ రహదారుల ప్రాఽధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు తెలియజేస్తారు. ప్రభుత్వం కూడా రైతులకు నష్టం లేకుండా ఉండేలా భూ విలువల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా భూ పరిహారం కింద ధరలను పెంచి, అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించింది. రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు అందించే పరిహారం ధరల అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన విధంగా రైతులకు గరిష్ట పరిహారం అందించేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. త్వరలోనే ధరలను ఖరారుచేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ రహదారి కోసం సేకరించే భూముల వివరాలను తెలుపుతూ 3డీ నోటిఫికేషన్‌ను గతంలోనే జారీ చేసింది. 3డీ అంటే రహదారి నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు ఎవరివి, ఎంత సేకరిస్తున్నామనే వివరాలను ప్రకటించడం. ఇప్పుడు ప్రభుత్వం పరిహారం ధరలను ఖరారు చేయగానే.. 3జీ అవార్డు నోటిఫికేషన్‌ను ప్రకటించనున్నారు. 3జీ అంటే రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించే పరిహారాన్ని ఖరారు చేయడం. ఖరారు చేసిన వివరాలను ప్రకటించడం.
పరిహారం పెంపు అంశం తేలితే చాలు
ఆర్‌ఆర్‌ఆర్ మంజూరై, భూ సేకరణకు వెళ్లేనాటికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం భూముల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం 2021లో ఒకసారి భూముల విలువలను సవరించింది. ఆ తరువాత మళ్లీ చేయకపోవడంతో పాత ధరలే అమల్లో ఉన్నాయి. దాంతో ఉత్తరభాగం రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులకు పరిహారంగా అతి తక్కువగా అందుతోంది. ఇదే విషయంపై రైతులు కోర్టులకు కూడా వెళ్లారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న అన్నదాతలకు నష్టం జరగకుండా ఉండాలని నిర్ణయించింది. అందుకోసమే ఆర్బిట్రేషన్ విధానంలో రైతులకు పరిహారం ధరలను పెంచాలని భావిస్తోంది. మరోవైపు పరిహారం ధరల పెంపు అంశంతో పాటు, అలైన్‌మెంట్ మార్పుపై కోర్టులో దాఖలైన పలు కేసులు ఇటీవల వెకేట్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. పరిహారం పెంపు అంశం తేలితే.. రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని అఽధికారిక వర్గాలు అంటున్నాయి.