Share News

GHMC: ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం.. 500 కోట్లు

ABN , Publish Date - Feb 25 , 2025 | 10:08 AM

లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది.

GHMC: ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం.. 500 కోట్లు

- జీహెచ్‌ఎంసీ అంచనా

- గ్రేటర్‌ పరిధిలో 1.06 లక్షల దరఖాస్తులు

- పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌ సిటీ: లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తుల పరిశీలనను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి 1,06,920 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 40వేల దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించగా, 3 వేల వరకు తిరస్కరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైబర్‌ వారియర్స్‌గా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌..


28 వేల మంది దరఖాస్తుదారులకు మరిన్ని ధ్రువపత్రాలు సమర్పించాలని(షార్ట్‌ ఫాల్‌), కొంత మందికి రుసుము చెల్లించాలని సందేశం పంపారు. వాటి ద్వారా సంస్థకు సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపశమనంగా ఉంటుందని రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. సవరణ మార్గదర్శకాల ప్రకారం చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, ప్రభుత్వ స్థలాల పక్కనున్న లే అవుట్‌/ప్లాట్ల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నిర్ణయం తీసుకోనున్నారు.


సర్వే నంబర్ల ఆధారంగా లే అవుట్‌/ప్లాట్‌ ఎక్కడున్నది గుర్తించి.. ఆ వివరాలు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కుపంపుతారు. అక్కడి నుంచి ఇరిగేషన్‌, రెవెన్యూ విభాగాలకు దరఖాస్తులు వెళ్తాయి. ఆయా విభాగాల అధికారుల సిఫారసు ఆధారంగా దరఖాస్తులను మునిసిపల్‌/ పంచాయతీరాజ్‌ విభాగాలు ప్రాసెస్‌ చేస్తాయి. ఆ రెండు కేటగిరీల్లో లేని భూములకు సంబంధించి ఆటోమేటిక్‌గా ఫీజు జనరేట్‌ అయి దరఖాస్తుదారుడికి సందేశం వెళ్తుంది. మార్చి 31వ తేదీలోపు 25 శాతం రాయితీతో రుసుము చెల్లించే అవకాశముంది. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పరిశీలించిన అనంతరం క్రమబద్ధీకరణకు సంబంధించి ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ ఇవ్వనున్నారు. దరఖాస్తు తిరస్కరించిన పక్షంలో చెల్లించిన మొత్తం రుసుములో 10 శాతం మినహాయించుకొని, మిగతాది దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేస్తారు.


జోన్ల వారీగా దరఖాస్తుల వివరాలు

జోన్‌ దరఖాస్తులు

ఎల్‌బీనగర్‌ 39,234

చార్మినార్‌ 15,283

ఖైరతాబాద్‌ 5,725

సికింద్రాబాద్‌ 5,694

శేరిలింగంపల్లి 18,622

కూకట్‌పల్లి 22,362

మొత్తం 1,06,920

Updated Date - Feb 25 , 2025 | 10:08 AM