GHMC: బల్దియా గొప్పలు.. తప్పవా తిప్పలు..
ABN , Publish Date - Jun 12 , 2025 | 08:15 AM
బల్దియా గొప్పలు ప్రజలకు తిప్పలుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ప్రచార ఆర్భాటం, పని చేస్తున్నామనే భావన ప్రజల్లో కల్పించేందుకు చేపట్టిన చర్యలు మొదటికే మోసం తెచ్చాయి.
- ప్రచారం కోసం జీహెచ్‌ఎంసీ తాపత్రయం
- అందుకే ప్రత్యేక వాహనాలు తెరపైకి
- కీలక అధికారి సూచనతో పరిశీలన
- రవాణా విభాగం కక్కుర్తితో మొదటికే మోసం
- వరుణుడు పలకరిస్తే అస్తవ్యస్తమే
హైదరాబాద్ సిటీ: బల్దియా గొప్పలు ప్రజలకు తిప్పలుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ప్రచార ఆర్భాటం, పని చేస్తున్నామనే భావన ప్రజల్లో కల్పించేందుకు చేపట్టిన చర్యలు మొదటికే మోసం తెచ్చాయి. సంస్థ బాధ్యతలను ఇతర విభాగాలకు బదలాయించిన పరిస్థితికి తీసుకువచ్చాయి. వర్షాకాల అత్యవసర/తక్షణ మరమ్మతు బృందాల ఏర్పాటుకు సంబంధించి ‘ప్రత్యేక’ వాహనాలు ఏర్పాటు చేయాలన్నది సంస్థలోని కీలక అధికారి నిర్ణయంగా తెలుస్తోంది. ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాల వినియోగం సబబు కాదని పేర్కొన్న ఆయన టీజీఎస్‌పీడీసీఎల్, అగ్నిమాపక శాఖ, హైడ్రా తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించినట్టు సమాచారం.
కొత్తగా వినియోగించనున్న వాహనాలపై హైడ్రా లోగో, కాల్ సెంటర్ నంబర్ తదితర వివరాలుండేలా చూడాలని సూచించారు. తద్వారా ఆయా పనులు జీహెచ్‌ఎంసీ(GHMC) చేస్తుందన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతుందని భావించారు. గతంలో వినియోగించిన వాహనాల వల్ల సంస్థకు పనిచేస్తుందన్న పేరు రాకపోగా, క్షేత్రస్థాయిలో వరద నీటి నిర్వహణ సరిగా జరగలేదన్న అభిప్రాయం సదరు అధికారి వ్యక్తం చేసినట్టు సమాచారం.
అధికారుల కక్కుర్తి
డివిజన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేసే బృందాలతో పాటు స్థానిక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వెళ్లేలా వాహనం ఉండాలని ఉన్నతాధికారి సూచించినట్టు తెలిసింది. డ్రైవర్‌తోపాటు ఏఈఈ కూర్చుంటారని, వెనుక వైపు పరికరాలు, కార్మికులు ఉండేందుకు సౌకర్యవంతంగా ఉండే వాహనం పరిశీలించాలని చెప్పారు. దీనిని రవాణా విభాగంలోని కొందరు అధికారులు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ఓ కంపెనీ వాహనాలు మాత్రమే వినియోగించేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ఆ వివరాలను ముందే తమకు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థలకు చెప్పి ముందస్తు ఒప్పందం చేసుకునేలా ప్రోత్సహించారు.

ఇప్పుడు అదే జీహెచ్‌ఎంసీకి ఇబ్బందికరంగా మారింది. టెండర్లలో గోల్‌మాల్‌తో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తయి అత్యవసర/తక్షణ మరమ్మతు బృందాలు అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశముంది. అదృష్టవశాత్తు ప్రస్తుతంవర్షాలు కురవడం లేదు. ఒకవేళ వరణుడు గట్టిగా పలకరిస్తే, వరద నీటి నిర్వహణ చర్యలు చేపట్టక మహానగర అస్తవ్యవస్తం కావడం ఖాయం. మొత్తంగా బల్దియా ప్రచార ఆర్భాటం.. మహానగర పౌరులకు ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News