Hyderabad: ప్యూచర్ సిటీపై ఫార్మాసిటీ బఫర్‌జోన్ కత్తి!
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:09 AM
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్యూచర్ సిటీపై.. ఫార్మాసిటీ బఫర్‌జోన్ కత్తి వేళాడుతోంది.
లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు రావట్లేదు.. రెండేళ్ల క్రితమే ఫార్మాసిటీకి బఫర్‌జోన్ ఖరారు
హైదరాబాద్ సిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్యూచర్ సిటీపై.. ఫార్మాసిటీ బఫర్‌జోన్ కత్తి వేళాడుతోంది. 56 రెవెన్యూ గ్రామాలతో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్యూచర్ సిటీకి ప్రత్యేక డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటు చేసినా.. ఫార్మాసిటీ బఫర్‌జోన్ అడ్డంకిగా మారుతోంది. ఫార్మాసిటీ కోసం రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం బఫర్‌జోన్‌ను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేటికీ ఆ ఆదేశాలు కొనసాగుతున్నాయి. ఈ బఫర్‌జోన్‌లో ఎలాంటి నివాస లేఅవుట్లకు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదంటూ అప్పట్లో హెచ్‌ఎండీఏకి మునిసిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు ఇప్పటికీ ప్యూచర్ సిటీ పాలిట అడ్డంకిగా ఉన్నాయి. దీంతో.. లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తులు రావడం లేదు. ప్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలుస్తోంది.
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీని ప్రకటించడంతో అప్పట్లో పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున రియల్‌ఎస్టేట్ సాగింది. భూముల ధరలు పెరగడంతో క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. అయితే, ఫార్మాసిటీ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలో, ఐదు కిలోమీటర్ల పరిధిలో, ఏడు కిలోమీటర్ల పరిధిలో బఫర్‌జోన్‌ను నిర్ణయించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందులో దేన్నీ ప్రభుత్వం ఖరారు చేయలేదు. కానీ ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో సుమారు ఏడు కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో ఎలాంటి లేఅవుట్‌లు, భవన నిర్మాణాలు, చివరకు గోదాముల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఉన్నత స్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఫార్మాసిటీ తర్వాత ఏడు కిలోమీటర్ల పరిధిలో అనుమతులను నిలిపివేశారు. దీంతో ఇప్పటికీ.. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల, మీర్‌ఖాన్‌పేట, పంజగూడ రెవెన్యూ గ్రామాలతోపాటు యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడపల్లి, నానక్‌నగర్, తాడిపత్రి గ్రామాలు, కడ్తాల్ మండలం పరిధిలోని ముద్విన్, కర్కల్‌పహాడ్, కడ్తాల్‌ను అనుకొని ఉన్న ఏడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్యూచర్ సిటీకి ఇబ్బంది..!
ముచ్చెర్ల పరిసర ప్రాంతాలను ప్రస్తుతం ప్యూచర్ సిటీగా నిర్ణయించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎఫ్‌సీడీఏని ఏర్పాటు చేసింది. ఈ ఆథారిటీ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే 56 గ్రామాలను కేటాయించింది. ప్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్‌చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా పలు శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఇటీవల ఎఫ్‌సీడీఏ అదనపు డైరెక్టర్‌ను నియమించారు. ఈ ప్రాంతంలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై స్పష్టతనిచ్చారు. అయితే.. ఫార్మాసిటీ బఫర్‌జోన్‌ను నిర్ణయిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ కొనసాగడంతో.. ప్యూచర్ సిటీలోని అత్యధిక ప్రాంతాల నుంచి భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల దరఖాస్తులు హెచ్‌ఎండీఏకు రావడం లేదు. ఒకవేళ దరఖాస్తు చేసినా.. డెవలపర్లకు నిరాశే ఎదురవుతోంది. ఫార్మాసిటీ బఫర్‌జోన్ తొలగింపు ఆదేశాలు వచ్చేదాకా అనుమతులు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేవరకు.. ప్రభుత్వం బఫర్‌జోన్ ఆంక్షలను కొనసాగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి